ఓడిన వేళ.. ఆస్ట్రేలియాను కొనేస్తారా? అన్న ప్రశ్నకు సత్యనాదెళ్ల జవాబు ఇదే
కానీ.. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియా చేరిన వేళ.. ఆ రోజు మ్యాచ్ కు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
By: Tupaki Desk | 22 Nov 2023 5:39 AM GMTమైక్రోసాఫ్ట్ సీఈవోగా భారతీయుడు.. తెలుగోడైన సత్యనాదెళ్ల అన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన కంపెనీకి కళ్లు.. చెవిగా పని చేసే ఆయనకు మిగిలిన భారతీయుల మాదిరి క్రికెట్ అంటే ప్రాణం. ఆయనకున్న స్థాయికి క్రికెట్ కోసం.. గంటల తరబడి సమాయాన్ని వెచ్చించటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియా చేరిన వేళ.. ఆ రోజు మ్యాచ్ కు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఒకదశలో మ్యాచ్ ను చూసినట్లుగా చెప్పారు.
ఆ మాటకు వస్తే.. న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ మ్యాచ్ ను అయితే రాత్రంతా మేల్కొని చూసినట్లుగా పేర్కొన్నారు. ఫైనల్ భారత్ ఓడిన వేళ.. ఆయనో పాడ్ కాస్ట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత వరల్డ్ కప్ గురించి.. భారత ఓటమి గురించి ప్రస్తావించారు. టీమిండియా ఓడిన వేళ.. గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మీద ప్రతీకారాన్ని తీర్చుకోవటం కోసం ఆస్ట్రేలియాను కొనేస్తారా? అంటూ కాస్తంత సరదాగా ప్రశ్నించారు.
దీనికి స్పందించిన సత్య నాదెళ్ల.. ‘‘ఆస్ట్రేలియాను కొనటం అంటే ఓపెన్ ఏఐను సొంతం చేసుకోవటం లాంటిదే. ఆ రెండూ సాధ్యం కాదు. కానీ.. ఓపెన్ ఏఐతో మేం భాగస్వాములం కాగలం. అలానే ఆస్ట్రేలియా క్రికెట్ ఆటను ఆనందిస్తాం’’ అంటూ తెలివిగా బదులిచ్చారు. ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా విజయం సాధించిన వెంటనే.. వారిని సోషల్ మీడియా వేదికగా అభినందిస్తూ పోస్టు పెట్టారు. అదే సమయంలో ఎంతో శ్రమించి అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ కు చేరిన టీమిండియాను అభినందించారు.
క్రికెట్ ఆటే..తనకు టీంతో కలిసి పని చేయటాన్ని.. నాయకత్వాన్ని నేర్పినట్లుగా సత్యనాదెళ్ల పేర్కొనటం తెలిసిందే. ఆయన్ను మైక్రోసాఫ్ట్ సీఈవో నియమించిన సమయంలో తనలో నాయకత్వ లక్షణాల్ని పెంచటంతో క్రికెట్ ఆట ఎంతలా తోడ్పడిందన్న విషయాన్ని చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే.. చాట్ జీపీటీ క్రియేటర్ శామ్ ఆల్ట్ మన్ ను ఇటీవల ఓపెన్ ఏఐ సీఈవో నుంచి తొలగించటం తెలిసిందే. ఆయన్ను మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ టీంలోకి తీసుకోనున్నట్లుగా సత్యనాదెళ్ల తెలిపారు. మొత్తంగా అదాటుగా వచ్చిన యార్కర్ లాంటి ప్రశ్నకు.. తెలివిగా.. ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేలా సమాధానం ఇచ్చిన సత్య నాదెళ్ల సమయస్ఫూర్తిని అభినందించాల్సిందే.