'అంకుల్ టీ తాగుదాం' పిలిపించి బుక్ చేసిన కిలేడీ
మొత్తంగా పట్టువదలని విక్రమార్కుల మాదిరి ప్రయత్నించిన పోలీసులకు ఈ కిలేడీ తాజాగా దొరికేసింది. ఆమెను ఆదివారం బ్యాడరహళ్లి పోలీసులు అరెస్టు చేశారు.
By: Tupaki Desk | 20 Jan 2025 8:30 AM GMTఆయనకు 57 ఏళ్లు. ఆమెకు 21 ఏళ్లు. తెలిసిన అమ్మాయే. ఇతగాడు కాంట్రాక్టర్. ప్రైవేట్ కాంట్రాక్టు పనులు చేస్తూ ఉంటాడు. అంకుల్.. అంకుల్ అంటూ అప్యాయంగా పలుకరిస్తుంది. ముచ్చటగా మాట్లాడుతుంటుంది. ఇదిలా ఉంటే.. సదరు అమ్మాయి.. తాజాగా తన ఇంటికి కొన్ని సివిల్ పనులు ఉన్నాయని.. వాటికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకోవటానికి ఇంటికి రావాలంటూ ఆహ్వానించింది.
తెలిసిన అమ్మాయి.. పని కూడా ఉందనుకొని.. టీ కోసం ఇంటికి ఆహ్వానించిన ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ క్రమంలో మరింత అడ్వాన్స్ అయిన ఆ అమ్మాయితో ఉండకూడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడకు కొందరు యువకులు హటాత్తుగా ప్రత్యక్షమయ్యారు. వీరిద్దరిని బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే.. వారిద్దరి వ్యవహారాన్ని బయటపెడతామని బ్లాక్ మొయిల్ చేశారు.
చేసేది ఏమీ లేకపోవటంతో భయంతో వారు అడిగిన డబ్బులు ఇచ్చేశాడీ వ్యక్తి. బతుకుజీవుడా అని బయటపడిన అతడికి.. తనను హనీట్రాప్ చేశారన్న విషయాన్ని గుర్తించాడు. పోలీసుల వద్దకు వెళ్లి.. జరిగింది జరిగినట్లుగా చెప్పేసి.. కంప్లైంట్ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులకు సదరు యువతి పరారీలో ఉందన్న విషయాన్ని గుర్తించారు.
మొత్తంగా పట్టువదలని విక్రమార్కుల మాదిరి ప్రయత్నించిన పోలీసులకు ఈ కిలేడీ తాజాగా దొరికేసింది. ఆమెను ఆదివారం బ్యాడరహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసుకు సంబంధించి మరో ముగ్గురిని కూడా అరెస్టు చేశారు. ఈ ఉదంతం గురించి తెలిసిన తర్వాత అర్థమయ్యేది ఒక్కటే.. ఎవరైనా కావొచ్చు..కాస్త జాగ్రత్తగా మాత్రం ఉండాలని.