Begin typing your search above and press return to search.

ద‌క్షిణ కొరియా దుమారం.. ఎంత దాకా?!

అంతేకాదు.. ఇద్ద‌రు పోలీసు ఉన్న‌తాధికారుల‌ను కూడా అరెస్టు చేయ‌డం గ‌మ‌నార్హం.

By:  Tupaki Desk   |   12 Dec 2024 11:30 AM GMT
ద‌క్షిణ కొరియా దుమారం.. ఎంత దాకా?!
X

ద‌క్షిణ కొరియా.. పెద్ద‌గా ఎప్పుడూ వార్త‌ల్లోకి రాని ఈ దేశం టెక్నాల‌జీ ప‌రంగా ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాయించుకుంది. సామ్‌సంగ్, ఎల్జీ వంటి సుప్ర‌సిద్ధ ప్ర‌పంచ స్థాయి కంపెనీల‌కు ఈ దేశం పెట్టింది పేరు. అలాంటి ద‌క్షిణ కొరియాలోఅనూహ్యంగా చోటు చేసుకున్న ప‌రిణామాలు.. నిరంత‌రం ర‌గులుతూనే ఉన్నాయి. తాజాగా అధ్య‌క్షుడు యూన్ సుక్‌యోల్ ఆఫీసులో సాధార‌ణ పోలీసులు త‌నిఖీలు చేసే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. అంతేకాదు.. ఇద్ద‌రు పోలీసు ఉన్న‌తాధికారుల‌ను కూడా అరెస్టు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

రెండు రోజుల కింద‌ట రాత్రికిరాత్రి ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో సైనిక పాల‌న(మార్ష‌ల్ లా) విధించారు. అస‌లు దీనిని ఎందుకు విధించాల్సి వ‌చ్చిందో.. ఆయ‌న ఎందుకు చేశారో కూడా వివ‌ర‌ణ ఇవ్వ‌కుండా.. అర్ధ‌రాత్రి 12.30 గంట‌ల స‌మ‌యంలో మార్ష‌ల్ లాను ప్ర‌క‌టించారు. అయితే.. ఆ వెంట‌నే దేశ ప్ర‌జ‌లు స‌హా ప్ర‌తిప‌క్షాలు.. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగాయి. వెనువెంట‌నే రాత్రివేళ కొలువుదీరిన పార్ల‌మెంటులో అభిశంస‌న తీర్మానం చేసింది.

దీంతో అధ్య‌క్ష ప‌ద‌వికి గండం ఏర్ప‌డుతుంద‌ని గ్ర‌హించిన అధ్య‌క్షుడు యూన్‌.. తెల్ల‌వారు జామున పార్ల‌మెంటు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే త‌న ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. అభిశంస‌న తీర్మానంపై రెండు రోజుల త‌ర్వాత‌ ఓటింగ్ జ‌రిగింది. అయితే..ఈ గండం నుంచి ఆయ‌న తృటిలో త‌ప్పుకొన్నారు. కానీ.. అస‌లు మార్ష‌ల్ లా విధించ‌డంపై ప్ర‌తిప‌క్షాలు నిప్పులు చెర‌గ‌డంతో ఆయ‌న‌పై కేసులు పెట్టారు. ఇది ద‌క్షిణ కొరియా దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. అధ్య‌క్ష భ‌వ‌నంలో త‌నిఖీల‌కు ప్రధాన మంత్రి కార్యాల‌యం ఆదేశించింది. ఆ వెంట‌నే సాధార‌ణ పోలీసులు గ‌త‌రాత్రి ఆయ‌న కార్యాల‌యంలోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించ‌గా అధ్య‌క్ష భ‌వ‌నం భ‌ద్ర‌తా సిబ్బందికి, పోలీసుల‌కు మ‌ధ్య తోపులాట‌లు జ‌రిగాయి. దీంతో అధ్య‌క్ష భ‌వ‌నంలోని పౌర సేవ‌ల కార్యాల‌యంలో సోదాలు నిర్వ‌హించి.. కీల‌క ప‌త్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ప్ర‌స్తుతం అధ్యక్షుడు యూన్‌ సహా పలువురు అధికారుల‌పై(ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన వారు) దేశద్రోహం కేసులు న‌మోద‌య్యాయి. మ‌రోవైపు అధ్య‌క్షుడు యోన్‌కు సన్నిహితులైన పలువురు అధికారులు రాజీనామా చేశారు. ఇదిలావుంటే.. అస‌లు ‘మార్షల్‌ లా’విధించడానికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రక్షణ మంత్రి కిమ్‌ యోంగ్‌ హ్యూన్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. దీంతో ఆయ‌న మంగ‌ళవారం రాత్రి జైలు గదిలో ఆత్మహత్యకు ప్ర‌య‌త్నించారు. అయితే.. ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు.

దేశం విడిచి పారిపోతారా?

అధ్య‌క్షుడు యోన్‌ను ప‌ద‌వినుంచి దింపి తీరుతామ‌ని ప్ర‌తిజ్ఞ చేసిన ప్ర‌తిప‌క్షాలు ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న‌పై అభిశంస‌న తీర్మానం ప్ర‌వేశ పెట్టాయి. ప్రధాన విపక్ష డెమొక్రటిక్‌ పార్టీ మరోసారి అభిశంసన తీర్మానం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. దీనిపై గురువారం చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్షుడు దేశం విడిచి పారిపోయే అవ‌కాశం ఉంద‌ని ద‌క్షిణ కొరియా మీడియా పేర్కొన‌డం గ‌మ‌నార్హం.