Begin typing your search above and press return to search.

ఈ దేశాల్లో ఇన్ కం ట్యాక్స్ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..

అంటిగ్వా, బెర్ముడా, బహమాస్, మొనాకో వంటివన్న ఆర్థికంగా అంత బాగున్నవి ఏమీ కాదు.. పెద్ద దేశాలు కూడా కాదు. వీటిలో కొన్ని ద్వీప దేశాలు కావడం గమనార్హం.

By:  Tupaki Desk   |   28 Jan 2025 2:30 PM GMT
ఈ దేశాల్లో ఇన్ కం ట్యాక్స్ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..
X

బడ్జెట్ వస్తుందంటే భారత ప్రజలు ఆశగా ఎదురుచూసేది పన్ను మినహాయింపుల గురించి.. బడ్జెట్ వస్తుందంటే సగటు వేతన జీవి ఆశించేది ఆదాయ పన్ను పోటు తప్పించుకోవడం గురించి.. వాస్తవానికి భారత్ తో పోలిస్తే యూరప్ దేశాల్లో పన్నుల బాదుడు మరీ ఎక్కువ. ఉదాహరణకు జర్మనీ వంటి దేశాల్లో పన్ను పోటు బాబోయ్ అనేలా ఉంటుంది. జీతంలో 40 శాతం వరకు ఇన్ కం ట్యాక్స్ కింద పోయే దేశాలున్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు మరి.. అయితే విదేశాల్లో ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే డబ్బును అవినీతికి తావు లేకుండా ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తుంటారు. అందుకనే ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత రాదు..

ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదాయ పన్ను రద్దు అంశాన్ని ప్రతిపాదించి పెద్ద సంచలనానికి తెరలేపారు. ఇది ఓ రకంగా అమెరికన్లకు బిగ్ రిలీఫ్ అనుకోవాలి. ఎందుకంటే.. ఇప్పటికీ భారతదేశంలో '25 శాతం శ్లాబ్' వస్తే చాలనుకునే రోజుల్లో ఉంటే.. ట్రంప్ ఏకంగా ఆదాయ పన్ను రద్దుకు ముందడుగు వేస్తున్నారు. కాగా, అసలు ఆదాయ పన్ను బాదుడే లేని దేశాలు ఈ భూమ్మీద ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోక మానరు.

పేరు లేని దేశాలే కానీ..

బెర్ముడా, అంటిగ్వా, బహ్రెయిన్, బ్రూనై, బహమాస్, కాయ్ మన్ ఐలాండ్స్, యూఏఈ, కువైత్, మొనాకో, ఒమన్, ఖతర్, సెయింట్ కిట్స్, సౌదీ అరేబియా, సోమాలియా, తుర్స్క్ అండ్ కైకోస్ ఐలాండ్స్, వనాటు, పశ్చిమ సహారా.. వీటిలో ఒక్కటీ అరా తప్ప పెద్దగా పేరున్న దేశాలేమీ లేవు. కువైత్, యూఈఏ, ఖతర్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ ఆయిల్ రిచ్ దేశాలు. సహజంగానే ఇవి సంపన్నం. అందుకనే ప్రజల నుంచి పన్నులు వసూలు చేయకున్నా పెద్దగా ఫరక్ పడదు.

అంటిగ్వా, బెర్ముడా, బహమాస్, మొనాకో వంటివన్న ఆర్థికంగా అంత బాగున్నవి ఏమీ కాదు.. పెద్ద దేశాలు కూడా కాదు. వీటిలో కొన్ని ద్వీప దేశాలు కావడం గమనార్హం. అయినప్పటికీ ప్రజల నుంచి ఆదాయ పన్ను వసూలు చేయడం లేదు.

ఆదాయ పన్ను లేకపోవడం ద్వారా వచ్చే నష్టాన్ని ఈ దేశాలు ప్రత్యామ్నాయ పద్ధతులు, పరోక్ష పన్నుల ద్వారా పూడ్చుకుంటుంటాయి. అంటే దిగుమతులపై సుంకాలు విధించడం వంటి పద్ధతులు పాటిస్తుంటాయి.