ఎన్నికల్లో ఐటీ పట్టుకున్న నల్ల సొమ్ము చూస్తే వామ్మో... !
తాజాగా అంటే 2024 ఎన్నికల్లో ఇన్ కం టాక్స్ విభాగం పట్టుకున్న నల్ల ధనం మే 30 అంటే గురువారం నాటికి అక్షరాలా 1100 కోట్లు పై మాటగా తేలింది.
By: Tupaki Desk | 31 May 2024 1:30 PM GMTఎన్నిక ఎన్నికకూ ప్రజల చైతన్యం ఎంతమేరకు పెరిగిందో తెలియదు కానీ నల్ల ధనం మాత్రం కట్టలు తెంచుకుంటోంది. నల్ల కట్ల పాములు మాత్రం బుసలు కొడుతూ ప్రజాస్వామ్యం మీద విషపు కాటు వేస్తూనే ఉన్నాయి. అది ప్రతీ ఎన్నికకూ పెరిగిపోతున్నాయి.
తాజాగా అంటే 2024 ఎన్నికల్లో ఇన్ కం టాక్స్ విభాగం పట్టుకున్న నల్ల ధనం మే 30 అంటే గురువారం నాటికి అక్షరాలా 1100 కోట్లు పై మాటగా తేలింది. దీనితో పాటు బంగారం కూడా ఐటీ శాఖ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు
ఎన్నికల్లో బయటకు వచ్చిన నల్ల ధనం దేశవ్యాప్తంగా వందల కోట్లు అని ఒక లెక్క తేలింది. ఇదే నల్ల ధనం 2019 ఎన్నికల్లో చూస్తే 390 కోట్లుగా ఉంది. అంటే ఇపుడు మూడింతలు నల్ల సొమ్ముని ఐటీ అధికారులు పట్టుకున్నారు అన్న మాట.
ఇదంతా అధికారులకు దొరికినది. ఇంకా దొరకని సొమ్ము ఎంత అన్నది ఊహలకూ లెక్కలకూ అందనంతగా ఉంది అని అంటున్నారు. ఇక ఈ నల్ల ధనం ఎక్కడ ఎక్కువగా పట్టుకున్నారు అంటే ఢిల్లీ తమిళనాడు, కర్నాటకలోనే ఎక్కువగా పట్టుకున్నట్లుగా ఐటీ వర్గాలు చెబుతున్నాయి.
ఈసారి చూస్తే ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న వచ్చింది. దాంతో రండున్నర నెలల పాటు దేశంలో ఐటీ సోదాలు దాడులు నిర్వహించింది. తమకు ఎక్కడ సమాచారం ఉన్నా వెంటనే వాలిపోయి నగదుని స్వాధీనం చేసుకుంది. ఆ విధంగా లెక్కా పత్రం లేకుండా ఐటీకి చేరిన నల్ల ధనం ఇంత అని అంటున్నారు.
ఇక ఈసారి ఎన్నికల్లో కేవలం దేశంలో ఎన్నికల ఖర్చు అంతా లక్ష కోట్లకు పై దాటి ఉంటుందని అంటున్నారు. ఏపీలోనే ప్రధాన పార్టీలు వేలలలో ఖర్చు చేశాయని చెబుతున్నారు. ఒక వైపు ఎన్నికల సంఘం విధించిన నిబంధనలు చూస్తే నలభై లక్షల వరకూ మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు చేయాల్సి ఉంది. కానీ దానికి వంద రెట్లు వేయి రెట్లు ఖర్చు చేశారు అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే మాత్రం ఈసారి ఎన్నికలు ఎన్నడూ లేనంత ధన ప్రవాహం తో నిండిపోయాయని అంటున్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్ తో సరిసాటిగా ఈసారి ఎన్నికల్లో పార్టీలు పెట్టిన ఖర్చు ఉందని అంటున్నారు. మరి ఇదంతా బ్లాక్ మనీయే అని అంటున్నారు.
ఎందుకంటే ఎన్నికల్లో వీటికీ లెక్కా జమా ఉండదు. వీటిని ఎక్కడ నుంచి ఎక్కడ వరకూ అయినా తీసుకెళ్ళి ఖర్చు చేయవచ్చు. ఆ విధంగా నల్ల కుబేరులు అంతా ఎన్నికల్లో కట్ల పాములను దించేసారు అని అంటున్నారు. అంతే కాదు ఈసారి ఎన్నికలు సుదీర్ఘ కాలం జరగడం వల్ల కూడా ఖర్చు బాగా పెరిగింది అన్నది మరో మాటగా ఉంది.