Begin typing your search above and press return to search.

జీపీయస్ ని గుడ్డిగా నమ్మితే.. ప్రాణాలు గోవిందా..

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన ఓ ఘోర ప్రమాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

By:  Tupaki Desk   |   24 Nov 2024 7:30 PM GMT
జీపీయస్ ని గుడ్డిగా నమ్మితే.. ప్రాణాలు గోవిందా..
X

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన ఓ ఘోర ప్రమాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా మనం బయటకు వెళ్లేటప్పుడు దారి తెలియని పరిస్థితుల్లో గూగుల్ మ్యాప్స్ ని ఉపయోగిస్తాం. మనల్ని మన గమ్యానికి చేర్చడానికి ఉపయోగించే గూగుల్ మ్యాప్స్ కారణంగా ఒక కుటుంబం తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది అక్షర సత్యం. ఇంకా నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి కారు అమాంతం నదిలోకి పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్టు పోలీసులు వెల్లడించారు.బదౌన్ జిల్లాలోని బరేలీ నుంచి

డేటాగంజ్‌కు ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. నవంబరు 24 ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదం సమాచారం అందుకున్న బరేలీలోని ఫరీద్‌పూర్..బదౌన్‌లోని డేటాగంజ్ పోలీస్ స్టేషన్ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.జేసీబీ సాయంతో ప్రమాదానికి గురి అయిన కారును నదిలో నుంచి బయటకు తీశారు. కారులో మరణించిన ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కేసు పై దర్యాప్తు ప్రారంభించారు.

అయితే పోలీసుల సమాచారం ప్రకారం ఈ ప్రమాదానికి ముఖ్య కారణం జీపీయస్ నావిగేషన్ అని తెలుస్తోంది. ఇంకా వంతెన పూర్తి కాలేదని.. కన్స్ట్రక్షన్ కొనసాగుతోంది అన్న విషయం కారులో ఉన్న వారికి తెలియదు. ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల్లో వంతెన ముందు భాగం కొట్టుకుపోయింది. జీపీయస్ నావిగేషన్ మ్యాప్ ప్రకారం బ్రిడ్జిపై దారి ఉండడంతో కారులో ప్రయాణిస్తున్న వారు వేగంగా వెళుతున్నారు. దీంతో అనుకోకుండా వంతెన పైనుంచి కారు జారి కిందకు పడిపోయింది.

ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జీపీయస్ ను నమ్మాలా వద్ద అన్న విషయంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. కేవలం జీపీయస్ ని నమ్ముకుని ముందు చూపు లేకుండా వేగంగా వెళ్లడం ఎంత ప్రమాదము అని చెప్పడానికి ఈ ఘటన పెద్ద ఉదాహరణ అనే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి దారి సరిగ్గా గమనించకపోవడం వల్ల, వేగంగా బండి నడపడం వల్ల ముగ్గురు అన్యాయంగా బలైపోయింది.