Begin typing your search above and press return to search.

పవన్ మీద పెరుగుతున్న వత్తిడి....రంగంలోకి బీజేపీ

2018లో పోటీ అంటే అపుడే కొత్తగా పార్టీ నిర్మాణం చేస్తున్నామని పోటీకి దూరంగా ఉన్నామని వారు అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 10:00 AM GMT
పవన్ మీద పెరుగుతున్న వత్తిడి....రంగంలోకి బీజేపీ
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వత్తిడి బాగా పెరుగుతోంది. తెలంగాణా ఎన్నికల్లో ఈసారి పోటీ చేయాలని తెలంగాణా జనసేన నేతలు గట్టిగా కోరుతున్నారని అంటున్నారు. తాజాగా పవన్ని హైదరాబాద్ పార్టీ ఆఫీసులో కలసిన జనసేన నేతలు ఈసారి పోటీ చేయకపోతే పార్టీ ఎదగడం కష్టమని తేల్చి చెప్పారని అంటున్నారు.

2018లో పోటీ అంటే అపుడే కొత్తగా పార్టీ నిర్మాణం చేస్తున్నామని పోటీకి దూరంగా ఉన్నామని వారు అంటున్నారు. ఇక మూడేళ్ళ క్రితం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మాట విని పోటీ నుంచి చివరి నిముషంలో తప్పుకున్నామని గుర్తు చేస్తున్నారు.

ఇపుడు సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఒక విధంగా జనసేనకు ఇది మంచి చాన్స్ అని వారు అంటున్నారు. పోటీ చేసి సత్తా చాటాలని జనసేన నేతలు అధినాయకత్వాన్ని కోరుతున్నారు. మొత్తం ముప్పయి రెండు సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ నుంచి ప్రచారం సాగుతోంది.

దాంతో ఆశావహులు అంతా పోటీకి ఉత్సాహం చూపుతున్నారు అని అంటున్నారు. ఎవరు ఏమి చెప్పినా ఈసారి పోటీకి రెడీ కావాలని కూడా తెలంగాణా నేతలు కోరారని అంటున్నారు. ఇదిలా ఉంటే మరో సంచలన పరిణామం తాజాగా జరిగింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను తాజాగా కలిసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ ఆయన మద్దతుని కోరారని ప్రచారం సాగుతోంది

తెలంగాణలో జనసేన పోటీ చేయకుండా తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు సమాచారంగా ఉంది. నిజంగా ఇదే విధంగా మూడేళ్ల క్రితం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేనను చివరి నిముషంలో పోటీ నుంచి తప్పించారు. అపుడు జనసేన క్యాడర్ చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఇపుడు మాత్రం పోటీయే అని ఆ పార్టీ నేతలూ అంటున్న నేపధ్యం ఉంది.

వారికి రెండు రోజుల సమయం జనసేన అధినాయకత్వం ఇచ్చిందని, ఈలోగా ఆలోచించి ఏ సంగతి చెబుతామని అంటోందని అంటున్నారు. ఈలోగా బీజేపీ రంగంలోకి దిగి మరోమారు జనసేన మద్దతు కోరడం విశేషం. జనసేన పోటీకి దిగకుండా తమకు మద్దతు ఇవ్వాలని కమలనాధులు కోరుతున్నారు.

అయితే దీని మీదనే చర్చ వస్తోంది. జనసేనతో ఏపీలో బీజేపీకి పొత్తు ఉంది. అది తెలంగాణాలో కూడా కొనసాగిస్తూ కొన్ని సీట్లు అయిన జనసేనకు ఇస్తే కచ్చితంగా మిత్రులుగా ఉన్నట్లుగా ఉంటుంది. పైగా మిగిలిన చోట్ల జనసేన మద్దతుని అడిగినా అర్ధం ఉంటుంది. అలా కాకుండా జనసేనను పోటీ నుంచి తప్పుకుని గమ్మున ఉండమని చెప్పి తమకే సపోర్ట్ చేయాలని బీజేపీ నేతలు కోరుతూండడం జనసేన క్యాడర్ కి నచ్చడం లేదు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే పవన్ మీద విపరీతమైన వత్తిడి ఉందని అంటున్నారు. బీజేపీ విషయంలో ఆలోచించాలి, అలాగే జనసేన క్యాడర్ విషయంలో ఆలోచించాల్సి ఉంది. మరి పవన్ ఏ డెసిషన్ తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.