హైదరాబాద్‌లో అదిరిపోతున్న ఇంటి అద్దెలు.. రీజనేంటి?
కేవలం ఏడాది వ్యవధిలో 20-25 శాతం చొప్పున అద్దెలు పెరిగిపోవడం గమనార్హం. మరీముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఈ తరహా వాతావరణం కనిపిస్తుండడం మరింత ఆసక్తిగా మారింది.
By: Tupaki Desk | 10 Nov 2023 9:30 AM GMTభాగ్యనగరం హైదరాబాద్ లో అద్దెకు నివసించాలంటే.. సగటు వేతన జీవి.. తన జీతంలో సగం చెల్లించు కోవాల్సిందే! ఔను.. ఇది నిజం. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న అద్దెల వ్యవహారం.. ఇటీవల కాలంలో భారీగా పుంజుకుంది. నగర విస్తరణ.. ఐటీ కంపెనీల రాక, ఉపాధి పెరుగుతుండడం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుండడం.. పొరుగున ఉన్న ఏపీలో పెద్దగా అభివృద్ధి లేక.. అక్కడ నుంచి కూడా విద్యార్థులు, ఉద్యోగం కోసం వచ్చేవారు పెరుగుతుండడంతో అద్దెల ధరలు అమాంతం కొండెక్కాయి.
కేవలం ఏడాది వ్యవధిలో 20-25 శాతం చొప్పున అద్దెలు పెరిగిపోవడం గమనార్హం. మరీముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఈ తరహా వాతావరణం కనిపిస్తుండడం మరింత ఆసక్తిగా మారింది. కూకట్ పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హైటెక్ సిటీల్లో అసలు అద్దె ఇళ్లు దొరకడమే గగనం అయితే.. దొరికినా.. అవి సాదారణ వేతన జీవులకు అందుబాటులో లేకుండా పోవడం మరో విషయం.
పారిశ్రామిక, ఐటీ నగరంగా గుర్తింపు పొందిన గచ్చిబౌలిలో ఏకంగా 24 శాతం మేరకు అద్దెలు పెరిగిపోయాయి. డబుల్ బెడ్ రూం ఫ్లాట్స్(1000 చదరపు అడుగులు) అద్దెలు గడిచిన 9 మాసాల్లో భారీగా పెరిగిపోయాయి. ఇక, హైటెక్ సిటీలోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది. ఇక్కడ అద్దెలు 16 శాతం మేరకు పెరిగిపోయాయి. 2022లో ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్ల అద్దెలు నెలకు.. రూ.24,600 ఉంటే ఇప్పుడు 28,500లకు చేరాయి.
ఇక, గచ్చిబౌలిలో గత ఏడాది డబుల్ బెడ్ రూం ఇళ్ల అద్దె రూ.23,400లుగా ఉంటే.. ప్రస్తుతం 29,000లు సమర్పించుకునే స్థాయికి చేరాయి. ఇదిలావుంటే.. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు.. ఐటీ కేంద్రాలుగా ఉన్న బెంగళూరు, మహారాష్ట్రలోని పూణేలోనూ ఇదే తరహాలో అద్దెలు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో ఇవి మరింత పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ ఉపాధి కోసం.. వేర్వేరు ప్రాంతాల నుంచి యువత తరలిరావడం.. వాణిజ్యం పరంగా, పారిశ్రామికంగా నగరాలు వృద్ధి చెందుతుండడంతో అద్దెలకు డిమాండ్ పెరిగిందని అంచనా వేస్తున్నారు.