Begin typing your search above and press return to search.

హామీలు నెర‌వేర్చ‌క‌పోతే.. క్రిమిన‌ల్ కేసులు పెట్టండి: ఇండిపెండెంట్ 'బాండ్ హామీలు'

ఈ క్ర‌మంలో మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి విద్యార్థి రాజ‌కీయ పార్టీ పేరుతో గొర్ల‌ప‌ల్లి సురేష్ అనే వ్య‌క్తి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:00 AM GMT
హామీలు నెర‌వేర్చ‌క‌పోతే.. క్రిమిన‌ల్ కేసులు పెట్టండి:  ఇండిపెండెంట్ బాండ్ హామీలు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిపోయింది. అయితే.. అభ్య‌ర్థులు ఓట‌ర్ల స్లిప్పులు పంచేందుకు..వ్య‌క్తిగ‌తంగా ఓట‌ర్ల‌ను క‌లుసుకునేందుకు ఎలాంటి నిబంధ‌న‌లు లేవు. ఈ క్ర‌మంలో మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి విద్యార్థి రాజ‌కీయ పార్టీ పేరుతో గొర్ల‌ప‌ల్లి సురేష్ అనే వ్య‌క్తి.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. అయితే.. ఆయ‌న రూ.100 రెవెన్యూ స్టాంపు పేప‌ర్‌పై త‌న‌ను గెలిపిస్తే..ఏమేం చేస్తానో.. చెబుతూ ఇంటింటికీ పంచుతున్నాడు. దీనిలో ఆస‌క్తిక‌ర హామీలు ఉన్నాయి. అదేస‌మ‌యంలో హెచ్చ‌రిక‌లు కూడా చేసుకున్నాడు.

గెలిచాక అభివృద్ధి చేయకపోతే త‌న‌పై క్రిమిన‌ల్ కేసులు పెట్టాల‌ని సురేష్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇక‌, త‌ను గెలిచిన త‌ర్వాత‌.. ఎమ్మెల్యేగా వ‌చ్చే శాల‌రీని నియోజ‌క‌వ‌ర్గంలోని వృద్ధులు, విక‌లాంగుల‌కు, వితంతువుల‌కు పంచేస్తాన‌ని చెప్పాడు. "మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు మనస్సు పెట్టి ఆలోచన చెయ్యాలి. పిచ్చిలేసి బాండ్ పేపర్ ఇవ్వడం లేదు - పిచ్చోళ్ళను ఎర్రగడ్డ పంపడానికే ఓటర్లయిన మీకు అవకాశం ఇస్తున్న. 20 సంవత్సరాలుగా మంచిర్యాలను దోచుకోవడానికే నాయకులు పోటీ చేస్తున్నారు, ఎన్నికల్లో గెలుస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నన్ను గెలిపించండి. గెలిచాక అభివృద్ధి చెయ్యకపోతే నాపై కేసులు పెట్టండి" అని బాండ్ పేపర్ లో రాసి ఇస్తున్నాడు.

ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన‌పార్టీల అభ్య‌ర్థుల‌కు కొన్ని ప్ర‌శ్న‌లు సంధించాడు. "మంచిర్యాల నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జాతీయ పార్టీలకు నేను విన్నవించుకునే ఒకే ఒక విషయం.. అభివృద్ధి చేసే దమ్ము మీకు ఉందా? ఓటుకు నోటు ఇవ్వకుండా గెలిచే దమ్ము మీకు ఉందా? అభివృద్ధి చెయ్యకపోతే కాల్చి చంపండి అనే మాట మీరు అనగలరా? కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బి.ఆర్.ఎస్ పార్టీలు దోచుకోవడానికి మాత్రమే పనికి వస్థాయి. అభివృద్ధి చేయడం ఈ పార్టీల వలన కాదు. బస్తీలో ప్రశ్నిస్తూ ప్రతి ఇంటికి బాండ్ పేపర్ ఇస్తున్నాను అంటే నాకు ఎంత పెద్ద ప్రణాళిక ఉందొ ఆలోచించండి. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు ఒకవైపు - నా బాండ్ పేపర్ ఒకవైపు. సవాల్ తో కూడిన బాండ్ పేపర్ ను నమ్మండి మంచిర్యాల అభివృద్ది కొరకు నడుం బిగించండి" అని సురేష్ పేర్కొన్నాడు.

మ‌రి సురేష్ ఈ బాండు హామీలు ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయో చూడాలి. చిత్రంఏంటంటే.. రాష్ట్రంలో ఇలానే న‌లుగురు బాండు పేప‌ర్ల‌పై ప్ర‌జ‌ల‌కు హామీలు గుప్పించారు. గ‌తంలో విశాఖ‌ప‌ట్నం ఎంపీగా పోటీ చేసిన జేడీ ల‌క్ష్మీనార‌య‌ణ కూడా బాండు పేప‌ర‌పై హామీలు ఇచ్చినా.. ప్ర‌జ‌లు ఓడించారు.