అమెరికాను కనిపెట్టింది మనోళ్లే.. మధ్యప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
అగ్రరాజ్యం అమెరికాను కనిపెట్టింది క్రిస్టఫర్ కొలంబస్ కాదట. మన భారతీయులే ఆ దేశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారట.
By: Tupaki Desk | 12 Sep 2024 6:20 AM GMTఅగ్రరాజ్యం అమెరికాను కనిపెట్టింది క్రిస్టఫర్ కొలంబస్ కాదట. మన భారతీయులే ఆ దేశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారట. అవునండీ.. ఈ వ్యాఖ్యలు చేసింది స్వయంగా ఓ మంత్రి. అమెరికాలో కనిపిస్తున్న భారతీయ సంస్కృతే ఇందుకు నిదర్శనమంటూ చెప్పుకొచ్చారు. అలాగే సముద్రమార్గాన్ని కనుగొన్నది సైతం వాస్కోడిగామా కాదంటూ వ్యాఖ్యలు చేసి తీవ్ర చర్చకు దారితీశారు.
మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. బర్కతుల్లా యూనివర్సిటీలో జరిగిన కాన్వకేషన్ వేడుకకు ఇందర్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. అమెరికాను మన దేశానికి చెందిన గొప్ప నావికుడు వాసులున్ కనిపెట్టాడని చెప్పారు. ఎనిమిదో శతాబ్దంలో వాసులున్ శాంటియాగో వెళ్లారని, అక్కడ ఎన్నో ఆలయాలను నిర్మించారని తెలిపారు. అక్కడి మ్యూజియంలో ఈ వాస్తవాలు సైతం ఉన్నాయని చెప్పారు. అందుకే.. అమెరికాను కనిపెట్టింది కొలంబస్ కాదని, మన పూర్వీకుడే అన్న విషయాన్ని విద్యార్థులకు బోధించాలని సూచించారు.
అలాగే.. భారత్‌కు సముద్ర మార్గాన్ని కనిపెట్టింది సైతం వాస్కోడిగామా కాదని మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. భారత్‌కు సముద్ర మార్గాన్ని గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి కనిపెట్టారని వెల్లడించారు. వాస్కోడిగామా సముద్రమార్గాన్ని కనిపెట్టిండని బోధించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ మార్గాన్ని గుజరాత్ వ్యాపారవేత్త చందన్ వెలుగులోకి తెచ్చారని చెప్పారు.
చందన్ అనే వ్యాపారి తనకంటే ముందు సముద్రమార్గంలో పయనించారని స్వయంగా వాస్కోడిగామా పేర్కొన్నట్లు తెలిపారు. చందన్ ఓడ తన ఓడ కంటే నాలుగు రెట్లు పెద్దదని వాస్కోడిగామా రాసుకొచ్చారని చెప్పారు. చరిత్రకారులు భారతదేశ బలాలను వెలుగులోకి రానివ్వలేదని ఆరోపించారు. తప్పుడు వాస్తవాలను ప్రచారం చేశారని అన్నారు. దాదాపు 1,200-1,300 సంవత్సరాలుగా, భౌగోళిక అపోహల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఈ అబద్ధం కొనసాగుతోందని పర్మార్ చెప్పారు.