చైనా, పాక్ సంబంధాలపై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
చైనా, పాకిస్థాన్‌ల కుట్రపూరిత సంబంధాలను భారత్ తప్పక గుర్తించాల్సిన అవసరం ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 8 March 2025 4:33 PM ISTచైనా, పాకిస్థాన్‌ల కుట్రపూరిత సంబంధాలను భారత్ తప్పక గుర్తించాల్సిన అవసరం ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రెండు దేశాల మధ్య బంధం వర్చువల్ డొమైన్‌లో వందశాతం ఉందని పేర్కొన్నారు. అలాగే భౌతికంగా పరిశీలించినప్పుడు, పాకిస్థాన్ చైనాలో తయారైన మిలిటరీ ఉత్పత్తులను విస్తృతంగా వినియోగిస్తోందని వివరించారు.
- యుద్ధ ముప్పు పెరుగుతున్న పరిస్థితి
భారత్ రెండువైపుల నుంచీ యుద్ధ ముప్పును ఎదుర్కొంటోందని జనరల్ ద్వివేది స్పష్టం చేశారు. వేసవి సమీపిస్తున్న కొద్దీ జమ్మూకశ్మీర్‌లో చొరబాట్లు పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. సరిహద్దుల వెంబడి చొరబాట్లు తగ్గే సూచనలు కనిపించడం లేదని, ఉగ్రవాదుల కదలికలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.
- ఉగ్రవాద కట్టడిలో భారత సైన్యం పురోగతి
భారత సైన్యం ఉగ్రవాద కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటోందని ద్వివేది వెల్లడించారు. 2018 నుంచి ఉగ్రవాద ఘటనల సంఖ్య 83 శాతం తగ్గాయని తెలిపారు. కేవలం 45 మంది మాత్రమే ఉగ్ర కార్యకలాపాల వైపు ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు.
- పర్యటన పెరుగుతోందని ఆర్మీ చీఫ్ వ్యాఖ్య
భారత సైన్యం తీసుకున్న చర్యల ఫలితంగా దేశంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతోందని ద్వివేది తెలిపారు. ఉగ్రవాదం తగ్గుముఖం పట్టడంతో, ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణించే పరిస్థితి ఏర్పడిందన్నారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసి, దేశాన్ని రక్షించేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.