Begin typing your search above and press return to search.

మమతని ఇండియా కూటమి ఎలా నమ్ముతుంది ?

ఆమె హ్యాట్రిక్ సక్సెస్ కొట్టిన సీఎం కావచ్చు. బెంగాల్ కి ఆడపులి లాంటి పొలిటీషియన్ కావచ్చు.

By:  Tupaki Desk   |   9 Dec 2024 11:30 PM GMT
మమతని ఇండియా కూటమి ఎలా నమ్ముతుంది ?
X

ఆమె హ్యాట్రిక్ సక్సెస్ కొట్టిన సీఎం కావచ్చు. బెంగాల్ కి ఆడపులి లాంటి పొలిటీషియన్ కావచ్చు. ఫైర్ బ్రాండ్ కూడా కావచ్చు. కానీ ఈ ప్లస్ ల మధ్య ఆమెకు మైనస్సులు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. ఆమె ఎవరో కాదు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆమె 2011లో తొలిసారి బెంగాల్ సీఎం అయ్యారు. దాని కోసం ఆమె 1999 నుంచి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసి బలమైన వామపక్షాల కంచుకోటను అలా బద్దలు కొట్టారు.

ఇపుడు చూస్తే మమతా బెనర్జీ కన్ను ప్రధాని పీఠం మీద ఉందని అంటున్నారు. ఆమె తాను ఇక ఉండాల్సింది సింహాసనం అధిరోహించాల్సింది ఢిల్లీలో అని పూర్తి ధీమాతో భావిస్తున్నారు అని అంటున్నారు. తన కత్తికి ఎదురు లేదు అన్నది మమత ధోరణి. ఆమెతో రాజీలు ఉండవు, అదే సమయంలో పేచీలకు కొదవ లేదు.

మమతా బెనర్జీ విషయంలో దూకుడు మాత్రమే అనుకూల ముద్ర కాదు స్వపక్షంలో విపక్షం అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆమె ఎపుడు ఏమి మాట్లాడుతారో ఏ సైడ్ తీసుకుంటారో ఎవరికీ అర్థం కాదని అంటారు. ఆమె ఒక పట్టాన అర్థం కారని ప్రత్యర్ధులు అంటారు.

ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ఇండియా కూటమిని సారధ్యం వహించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆమెకు పక్క వాయిద్యంగా ఎస్పీ కూడా ఫుల్ సపోర్టు ఇస్తోంది. మరో వైపు చూస్తే ఆమె వైఖరి చూసిన వారు ఇండియా కూటమి విషయంలో ఏమి జరుగుతుంది అని కంగారు పడుతున్నారు.

మమతా బెనర్జీ ఎపుడేమి స్టేట్మెంట్ ఇస్తారో కూడా ఎవరికీ తెలియదు అని అంటున్నారు. ఇక ఇప్పటికే ఇండియా కూటమిని హిందువులను దూరం చేయాలని ప్రత్యర్ధి వర్గాలు చూస్తున్నాయి. దానికి తోడు అన్నట్లుగా మమతా పోకడలు ఉన్నాయని అంటున్నారు. ఆమె జోరు ఎపుడూ స్వపక్షానికే కాదు సొంత కూటమికే బేజారు అని విశ్లేషిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఇండియా కూటమిలో కీలకమైన భాగస్వమిగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అగ్ర నేత, జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇండియా కూటమి సారధ్య బాధ్యతలపై ఇపుడు చర్చ ఏంటి అంటున్నారు. అసలు ఈ చర్చ ఎపుడు మొదలైంది అని ప్రశ్నిస్తున్నారు.

మమతా బెనర్జీకి ఇండియా కూటమి సారధ్యం అప్పగించాలన్న డిమాండ్లు ఒక వైపు వస్తూంటే ఒమర్ అబ్దుల్లా మాత్రం ఆచీ తూచీ దీని మీద మాట్లాడుతున్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత ఇండియా కూటమి భేటీ అన్నది జరగనే లేదు అని ఆయన గుర్తు చేస్తున్నారు.

అలాంటపుడు కూటమి నాయకత్వం విషయంలో మార్పుల గురించి ఎవరు చర్చించారు అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇండియా కూటమి సమావేశం నిర్వహించినపుడు మాత్రమే మమతా బెనర్జీ సారథ్య బాధ్యతల గురించి మాట్లాడవచ్చు అని అంటున్నారు. ఆనాడే నాయకత్వం బాధ్యతల మీద చర్చ సాగుతుందని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఇండియా కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి. మమతా బెనర్జీ సారధ్యం పట్ల వారంతా సహకరిస్తారా అన్న చర్చ ఉండనే ఉంది. ఆ మాటకు వస్తే గతంలోనే మమతా బెనర్జీ లీడర్ షిప్ గురించి ప్రయత్నం చేశారు, అలాగే అప్పుడు ఇండియా కూటమిలో ఉండే బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా సారధ్యం కోసం ఆశపడ్డారని వార్తలు వచ్చాయి. కానీ అది కుదరలేదు. మరి నాడు జరగనిది నేడు జరుగుతుందా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా మమతా బెనర్జీ విషయంలో ఇండియా మిత్రులకు నమ్మకం పాళ్ళు ఎంత అన్నదే ఇక్కడ వ్యక్తం అవుతున్న అభిప్రాయంగా ఉంది.