Begin typing your search above and press return to search.

నితీష్ కుమార్ పై అభిమానమా...అపనమ్మకమా ?

ఎన్డీయేతో కలసి ఎన్నికల్లో గెలిచిన తరువాత ఒకసారి ఆ మధ్యలో ఇండియా కూటమితో చేరి మరో సారి, మళ్ళీ అటునుంచి ఇటుగా ఎన్డీయేలోకి వచ్చి ప్రమాణం చేశారు.

By:  Tupaki Desk   |   1 Feb 2025 6:30 PM GMT
నితీష్ కుమార్ పై అభిమానమా...అపనమ్మకమా ?
X

రాజకీయాల్లో ఎపుడూ రెండు ఫ్యాక్టర్లు బలంగా పనిచేస్తూ ఉంటాయి. ఎవరి మీద అయినా అభిమానం అయినా ఉండాలి లేదా అపనమ్మకం అయినా ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండి సదరు వ్యక్తులు కానీ పార్టీలు కానీ తమకు ఎంతో అవసరం అయినపుడు ఎక్కడ లేని ప్రేమలూ కురిపించేస్తారు. ఇదంతా ఎందుకు అంటే కేంద్ర బడ్జెట్ లో బీహార్ కి కురిపించిన వరాలను చూసి అంతా చేస్తున్న విశ్లేషణ.

కేంద్రంలో మూడవసారి వరుసగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే ఈ ప్రభుత్వానికి రెండు ఊతకర్రల సాయం అవసరం పడింది. ఏపీ నుంచి టీడీపీ బీహార్ నుంచి జేడీయూ ఎంపీలే ఎన్డీయే సర్కార్ కి ఆక్సిజన్. ఇంకా జాగ్రత్తగా చెబితే ఏపీలో టీడీపీకి ఏకంగా 16 మంది ఎంపీలు ఉంటే జేడీయూకి 12 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. అంటే నాలుగు ఆకులు ఎక్కువ టీడీపీయే అని చెప్పాలి.

కానీ కేంద్రం వద్ద బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ మాటే ఎందుకు చెల్లుబాటు అవుతోంది, ఆ రకమైన కలరింగ్ ఎందుకు వస్తోంది అంటే దీనికి అభిమానం అయినా నితీష్ మీద కేంద్ర పెద్దలకు ఉండాలి, లేదా అపనమ్మకం అయినా ఉండాలి. అందుకే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి ఎంతో చేయబోతున్నమని బడ్జెట్ లో చెప్పడమే కాదు పదే పదే కేంద్ర మంత్రి నోట కూడా బీహార్ పేరు వినిపించింది.

ఇక నితీష్ మీద అభిమానమా అంటే అది రాజకీయ అవసరం అయిన అభిమానం అయి ఉండాలి. నితీష్ వేరే పార్టీకి చెందిన వారు ఎన్డీయేకు ఆయన మిత్రుడుగా ప్రత్యర్థిగా కూడా ఉన్నారు. ఆయన చాలా సులువుగా జాతీయ శిబిరాలను మార్చేస్తారు అని పేరు ఉంది. అంతవరకూ ఎందుకు 2020లో ఆయన బీహార్ సీఎం అయిన తరువాత మూడు సార్లు ప్రమాణం చేసారు.

ఎన్డీయేతో కలసి ఎన్నికల్లో గెలిచిన తరువాత ఒకసారి ఆ మధ్యలో ఇండియా కూటమితో చేరి మరో సారి, మళ్ళీ అటునుంచి ఇటుగా ఎన్డీయేలోకి వచ్చి ప్రమాణం చేశారు. ఈ విధంగా కేవలం అయిదేళ్ళ కాలంలో మూడు సార్లు సీఎం గా ప్రమాణం చేయడం అలాగే మూడు సార్లు పదవికి రాజీనామా చేయడం ఇవన్నీ నితీష్ కుమార్ కి మాత్రమే చెల్లిన రాజకీయాలు.

ఇక ఆయన మీద ఇండియా కూటమి కన్ను ఉంది. నితీష్ ట్రాక్ రికార్డు చూసిన బీజేపీకి అప నమ్మకమూ అంతే స్థాయిలో ఉంది. దాంతో ఆయనను తమ వెంట ఉంచుకుని ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే బీహార్ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలన్నది బీజేపీ ప్లాన్. అందుకే స్వామి కార్యక్రం స్వకార్యం అన్నట్లుగా బీహార్ కి దండీగా నిధులను ఇచ్చింది ప్రాజెక్టులు ప్రకటించింది అని విశ్లేషిస్తున్నారు.

మరి అదే సమయంలో చంద్రబాబు మీద అభిమానం కానీ అపనమ్మకం కానీ లేవా అంటే బాబు కూడా ఎన్డీయేతో అనేకసార్లు కలిసారు, విడిపోయారు. కానీ ఆయన మీద ఈసారికి అయితే బీజేపీకి అభిమానం కంటే నమ్మకం ఎంతో ఉంది అని అంటున్నారు. దానికి కారణం ఏపీలో రాజకీయ పరిస్థితులు, చంద్రబాబు ఆలోచనలు, ఆయన అజెండా ఇవన్నీ చూసిన బీజేపీ పెద్దలకు బాబు వీడి పోరు అన్న భరోసా ఉందని అంటారు.

అంతే కాదు ఏపీలో బీజేపీకి మరో కీలక మిత్ర పక్షంగా జనసేన ఉంది. అవసరం అనుకుంటే పరోక్ష మితృత్వంగా వైసీపీ ఉంది. అందువల్ల ఏపీలో బాబుకు ఉన్న రాజకీయ సంక్లిష్టతలు చాలా ఉన్నాయి. అదే బీహార్ లో అయితే నితీష్ వీడిపోతే అక్కడ ప్రతిపక్ష ఆర్జేడీ వచ్చి ఎన్డీయేలో చేరదు, పరోక్షంగా కూడా చేయి కలపదు, ఇక ఇతర మిత్రులలొప రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు ఉన్నా ఇపుడిపుడే ఎదుగుతున్న నేత. అందువల్ల నితీష్ లేకుండా పని జరగదు అనేది ఉంది. దాంతోనే రాజకీయ అనివార్యతలు బీహార్ వైపు బీజేపీ త్రాసు మొగ్గేలా చేస్తున్నాయని చర్చించుకుంటున్నారు.