మన దేశంలో బంగారం ధరని ఎవరు డిసైడ్ చేస్తారు?
బంగారానికి భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ప్రపంచంలో మరే దేశ పౌరులు సైతం భారతీయుల మాదిరి బంగారాన్ని ప్రేమిస్తారని చెప్పలేం.
By: Tupaki Desk | 12 Feb 2025 7:30 AM GMTబంగారానికి భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ప్రపంచంలో మరే దేశ పౌరులు సైతం భారతీయుల మాదిరి బంగారాన్ని ప్రేమిస్తారని చెప్పలేం. స్వర్ణాన్ని అమితంగా ఆరాధించే భారతీయులు తమ స్థాయికి మించి కూడా బంగారాన్ని కొనుగోలు చేసే సందర్భాలు బోలెడు. బంగారాన్ని పెట్టుబడిగా.. భవిష్యత్తుకు బాసటగా కొనుగోలు చేసే ధోరణి కనిపిస్తుంది. దాన్నో ఆభరణం మాదిరే కాదు.. ఫ్యూచర్ అవసరాల్నితీర్చే ముఖ్యమైన వస్తువుగా.. తమ ఆశల్ని తీర్చే ఆభరణంగా చూడటం తెలిసిందే.
గడిచిన కొద్ది రోజలుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా చేసుకొని చెలరేగిపోతున్నాయి. రోజుకో కొత్త రేటుతో జీవిత కాల గరిష్ఠాన్ని నమోదు చేస్తూ.. రికార్డుల మీద రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకూ మన దేశంలో బంగారం ధరల్ని ఎవరు డిసైడ్ చేస్తారు. ఏ రోజు.. ఏ సమయానికి ఎంత ధర ఉండాలన్న విషయాన్ని నిర్ణయించి.. నిర్దారించేది ఎవరు? అన్నది ఒక ప్రశ్న.
బంగారాన్ని దాని స్వచ్చత ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరిస్తారు. 18 క్యారెట్.. 24 క్యారెట్.. 24క్యారెట్ అన్న మూడు కేటగిరిలో బంగారం లభిస్తుంది. ఫిబ్రవరి పదకొండు నాటికి 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర రూ.87,380గా ఉంటే.. 22 క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర రూ.80,100గా ఉంది. అదే 18 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.65,540గా ఉంది. ఇదంతా బాగానే ఉంది కానీ.. అసలు ప్రశ్న. రోజువారీ బంగారం ధరను డిసైడ్ చేసేది ఎవరు? అన్నది చూసినప్పుడు ‘ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్’ సంస్థ ఈ పని చేస్తుంది.
ఈ సంస్థ మాత్రమే బంగారం ధరను రోజువారీగా డిసైడ్ చేస్తూ ఉంటుంది.ఇందులో దేశంలోని అతి పెద్ద బంగారు డీలర్స్ ఉంటారు. నిత్యం వీటి ధరల్ని అంతర్జాతీయ డిమాండ్.. సప్లై.. దిగుమతి పన్నులు.. కరెన్సీ హెచ్చుతగ్గులు.. స్థానిక పన్నులు లాంటి అంశాల్ని బేరీజు వేసుకొని డిసైడ్ చేస్తారు. గడిచిన కొద్దిరోజులుగా దేశంలో బంగారం ధరలు భారీగా పెరగటానికి కారణాలేమిటన్నది చూస్తే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్ గా చెప్పొచ్చు. దీంతో చాలామంది బంగారం మీద పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపటం కూడా బంగారం ధరలు భగ్గుమనటానికి కారణంగా చెప్పొచ్చు. రియల్ ఎస్టేట.. స్టాక్ మార్కెట్.. మ్యూచువల్ ఫండ్స్..లాంటి వాటిలో మాత్రమే కాకుండా బంగారం మీద కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావొచ్చు కానీ బంగారం మాత్రం సిరులు తేవటం ఖాయమన్న కారణంగా కూడా ఇందులో అధికంగా పెట్టుబడులు పెట్టటానికి కారణంగా చెప్పక తప్పదు.