రెండూ ఒకేసారి..పన్నూ బెదిరించాడు..ఖలిస్థానీలను ట్రూడో ఒప్పుకొన్నాడు
భారత సమగ్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
By: Tupaki Desk | 9 Nov 2024 10:38 AM GMTభారత్-కెనడా సంబంధాలు మరెప్పటికీ మారని స్థాయికి దిగజరాయా..? ట్రూడో ప్రభుత్వం వెళ్లిపోతే గానీ.. మళ్లీ పాత స్థాయికి రావా..? ఖలిస్థానీల ఆగడాలు.. హిందువులపై దాడులు.. భారత్ పై అకారణ ద్వేషం.. దౌత్యవేత్తలు, నాయకులపై ఆరోపణలు.. ఇలా ఒకటేమిటి.. అనేక ఉదంతాలు. తాజాగా మరో రెండు ఘటనలు జరిగాయి. భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు కెనడా ప్రధాని. తమ దేశంలో ఖలిస్థానీ మద్దతుదారులు ఉన్నట్లు అంగీకరిస్తూనే.. వాళ్లంతా సిక్కులకు ప్రతినిధులు కాదన్నారు. మోదీ ప్రభుత్వ మద్దతుదారులు ఎంతోమంది కెనడాలో ఉన్నారని, వారంతా హిందూ కెనడియన్లకు ప్రతినిధులు కాదంటూ దీనికి ముడిపెట్టారు. భారత సమగ్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అన్ని వర్గాల సంప్రదాయాలను కొనసాగించేలా ప్రోత్సహిస్తామని అంటూనే.. తమ దేశంలో హింస, అసహనం, బెదిరింపులు, విభజనకు తావు లేదని ట్రూడో పేర్కొంటున్నా.. కెనడా బ్రాంప్టన్ లోని హిందూ సభ ఆలయ ప్రాంగణంలో ఇటీవల సిక్కు వేర్పాటువాదులు ఖలిస్థానీ జెండాలతో వచ్చి హిందూ భక్తులను కొట్టడం గమనార్హం. భారత కాన్సులర్ శిబిరంపైనా వారు దాడి చేశారు. ఈ ఘటన పట్ల భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. హిందువులకు భద్రత కల్పించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలోనే ట్రూడో వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు ఖలిస్థానీలకు ప్రోత్సాహం ఇస్తూనే.. మరోవైపు భారత్ తో కయ్యానికి కాలుదువ్వేలా వ్యవహరిస్తున్నది కెనడా.
ఆస్ట్రేలియా టుడేకు బెదిరింపులు
భారత్-కెనడా మధ్య ఖలిస్థానీలతో పాటు ఆస్ట్రేలియా మీడియా అంశమూ చర్చనీయాంశమైంది. వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ తమను బెదిరించాడని ఆస్ట్రేలియా టుడే మీడియా తెలిపింది. సోషల్ మీడియా హ్యాండిల్స్, కొన్ని పేజీలను స్తంభింపజేసింది. కాగా, భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రెస్ మీట్ ను కవర్ చేసినందుకు ఆస్ట్రేలియా టుడేపై కెనడా నిషేధం విధించింది. పన్నూనే కాక ఇతర వేర్పాటువాదుల నుంచి కూడా తాము బెదిరింపులు ఎదుర్కొన్నట్లు ఆస్ట్రేలియా టుడే ఎడిటర్ జితార్థ్ జై భరద్వాజ్ తెలిపారు. అమెరికా, కెనడాలో కవరేజీ చేసినందుకు తమ ఫొటోలను పన్నూ ఆన్ లైన్లో ఉంచినట్లు పేర్కొంది. తమ సంగతి చూడమంటూ పన్నూ మద్దతుదారులను రెచ్చగొట్టాడని పేర్కొంది.