2035 ఖర్చుల్లో సగం జెడ్ జనరేషన్ దే.. రిపోర్టు చెప్పిందిదే!
దీంతో 2034 నాటికి దేశంలో వినియోగం రెట్టింపు అవుతుందని.. ప్రధాన ఆర్థిక వ్యవస్థలను భారత్ అధిగమిస్తుందన్న అంచనాను ఏంజిల్ వన్ రిపోర్టు వెల్లడించింది.
By: Tupaki Desk | 27 March 2025 7:30 AMఆసక్తికర నివేదిక ఒకటి విడుదలైంది. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని చెబుతున్నారు. దేశీయంగా వినియోగదారుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. చిన్న కుటుంబాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో 2034 నాటికి దేశంలో వినియోగం రెట్టింపు అవుతుందని.. ప్రధాన ఆర్థిక వ్యవస్థలను భారత్ అధిగమిస్తుందన్న అంచనాను ఏంజిల్ వన్ రిపోర్టు వెల్లడించింది.
ఇందులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. వినియోగానికి జెడ్ జనరేషన్ ముందు ఉంటుందని.. అదే సమయంలో పొదుపులోనూ దూసుకెళ్లటం ఖాయమని చెబుతున్నారు. అవసరమైన వస్తుసేవల్ని సొంతం చేసుకోవటం కోసం పొదుపు చేసుకునే సొమ్మునే వినియోగించే తీరు ఉంటుందని చెబుతున్నారు. దేశంలో వినియోగం స్థూల దేశీయ ఉత్పత్తిలో 56 శాతం వాటా ఉందంటున్నారు.
దేశంలో చిన్న కుటుంబాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. దీంతో.. జనాభా పెరుగుదల కంటే ఇళ్ల సంఖ్యలో పెరుగుదల ఎక్కువగా ఉంటోంది. రాబోయే పాతికేళ్లలో భారత్ లో పొదుపు గడిచిన ఇరవైఐదేళ్ల మొత్తం పొదుపు కంటే పది రెట్లు ఎక్కువగా ఉండనుందని అంచనా వేస్తున్నారు. 1997 నుంచి 2023 ఆర్థిక సంవత్సరం మధ్య దేశంలో మొత్తం సేవింగ్స్ 12 ట్రిలియన్ డాలర్లుగా చెప్పాలి. మన రూపాయిల్లో చెప్పాల్సి వస్తే.. రూ.పది కోట్ల కోట్లు (10,32,00,000 కోట్లు) 2047 నాటికి ఇది కాస్తా 103 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోనుంది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.88.58 కోట్ల కోట్లుగా (రూ.88,58,00,000 కోట్లు) చెప్పాలి. వినియోగం భారీ స్థాయిలో పెరిగేందుకు ఇది సాయం చేయనుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో పన్ను ఊరట కారణంగా ప్రజల చేతుల్లోకి రూ.లక్ష కోట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయన్న అంచనాను వ్యక్తం చేసింది.
దీంతో రూ.3.3 లక్షల కోట్లు పెరుగుతుందని.. ఇది దేశీయ జీడీపీని ఒక శాతం పెంచే వీలుందని చెబుతున్నారు. అమెరికా..చైనాలో అనవసర ఖర్చులు అవసరాల్ని అధిగమిస్తే.. మన దేశంలో ఆదాయంతో పాటు పొదుపు పెరుగుతున్న అంశాన్ని ప్రస్తావించింది. కన్సూమర్ ఎలక్ట్రానిక్స్.. దుస్తులు. ఉపకరణాలు.. ఆభరణాలు.. అనుభూతి కోసం వినియోగదారులు అధికంగా ఖర్చు చేయనున్నట్లు చెప్పింది. ఇప్పటికీ 92 శాతం రిటైల్ వ్యాపారం కిరాణా దుకాణాల ద్వారా జరుగుతుందని.. మార్కెట్ వాటాను పెంచుకోవటానికి ఆధునిక రిటైల్ కు భారీ అవకాశం ఉందని తెలిపింది. 1996-2012 మధ్యన పుట్టిన వారిని జెడ్ జనరేషన్ గా పిలవటం తెలిసిందే. 2035 నాటికి భారతదేశం మొత్తం చేసే ఖర్చులో ఈ తరం వారు చేసే ఖర్చు 50 శాతం ఉండటం గమనార్హం.