Begin typing your search above and press return to search.

150 గంటల్లో 1.51 లక్షల చ.అ. నిర్మాణం పూర్తి.. అదెలా?

అదేమీ వంద గజాల స్థలం కాదు. దగ్గర దగ్గర ఒక లక్షా యాభై ఒక్క వేల అడుగుల నిర్మాణాన్ని చేపట్టారు. అది కూడా కేవలం 150 గంటలు.

By:  Tupaki Desk   |   27 Nov 2024 9:30 AM GMT
150 గంటల్లో 1.51 లక్షల చ.అ. నిర్మాణం పూర్తి.. అదెలా?
X

అదేమీ వంద గజాల స్థలం కాదు. దగ్గర దగ్గర ఒక లక్షా యాభై ఒక్క వేల అడుగుల నిర్మాణాన్ని చేపట్టారు. అది కూడా కేవలం 150 గంటలు. రోజుల్లో చెప్పాలంటే ఆరు రోజులకు కాస్త ఎక్కువ. సరే.. ఏడో రోజు కూడా వేసుకుందాం. కానీ.. ఏడో రోజులోకి రాక ముందే.. 1.51 లక్షల చదరపు అడుగుల నిర్మాణాన్ని పూర్తి చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. దేశంలో ఇంత వేగంగా పూర్తి చేసిన నిర్మాణం ఇదే. దీనికి సంబంధించిన రికార్డు తాజాగా నమోదైంది. ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ తయారీలో మంచి పేరున్న ఈప్యాక్ ప్రిఫ్యాబ్ సంస్థ.. ఈ అద్భుతాన్ని వాస్తవానికి తీసుకొచ్చింది.

ఇంతకు ఈ ఇంజినీరింగ్ అద్భుతం ఎక్కడ చోటు చేసుకుందంటే.. ఆంధ్రప్రదేశ్ లో కావటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఏపీలోని మంబట్టులో ఈ పీఈబీ(ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్) ను పూర్తి చేశారు. ఈ నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక నిర్మాణాన్ని 48వ గంటకు పూర్తి చేయగా.. 90 గంటల నాటికి రూఫింగ్ ను పూర్తి చేశారు. 120వ గంటకు క్లాడింగ్ పూర్తైంది. అనుకున్న సమయానికి.. అంచనా వేసుకున్న విధంగానే నిర్మాణాన్ని పూర్తి చేయటం విశేషం.

దేశంలోనే అత్యంత వేగంగా నిర్మించిన కట్టడంగా రికార్డు క్రియేట్ చేయటమే కాదు.. గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది. పీఈబీ టెక్నాలజీని ఉపయోగించి దేశంలోనే అత్యంత వేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత తమకు దక్కుతుందని.. భవిష్యత్తు మొత్తం పీఈబీ నిర్మాణాలకే ఉంటుందనన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిఖెల్ బోత్రా. ఒకరకంగా చెప్పాలంటే ఈ నిర్మాణం దేశీయ నిర్మాణ రంగంలో సరికొత్త విప్లవాన్ని స్రష్టిస్తుందన్న అభిప్రాయం నెలకొంది.