Begin typing your search above and press return to search.

ప్రాశ్చాత్య దేశాలు.. స్వయం ప్రకటిత మేధావులతోనే.. ఏసుకున్న జైశంకర్

ప్రపంచ వేదికల మీద ఈ మాత్రం ధైర్యం ప్రదర్శించటం అభినందనీయమనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   16 Feb 2025 5:00 AM GMT
ప్రాశ్చాత్య దేశాలు.. స్వయం ప్రకటిత మేధావులతోనే.. ఏసుకున్న జైశంకర్
X

ఆచితూచి మాట్లాడటం.. నొప్పించిన వారిని సైతం వినమ్రతతో వ్యవహరించటం లాంటివి గతంలో భారతదేశ విదేశాంగ పాలసీగా ఉండేవి. గతంతో పోలిస్తే.. వర్తమానంలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో ప్రాశ్చత్య దేశాలు మనపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే మౌనంగా భరించేటోళ్లం. ఏమైనా అంటే.. ఇంకేమైనా అవుతుందేమోనన్న భయం.. బెంగ.. బెరుకు ఉండేవి. కానీ.. పరిస్థితి ఇప్పుడు అలా లేదు. అందుకు తాజాగా జర్మనీలో జరిగిన భద్రతా సమావేశంలో పాల్గొనే కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తన అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పేశారు. ప్రాశ్చత్యదేశాలు కాస్త దిగాలన్న ఆయన.. వారి తీరుపై విమర్శలు చేసేందుకు అస్సలు తగ్గలేదు. ఆ మాటకు వస్తే.. ఓరేంజ్ లో ఏసుకున్నారనే చెప్పాలి. ప్రపంచ వేదికల మీద ఈ మాత్రం ధైర్యం ప్రదర్శించటం అభినందనీయమనే చెప్పాలి.

ప్రజాస్వామ్యంపై ప్రాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న రెండు నాల్కుల ధోరణిపై తన అభిప్రాయాల్ని కుండబద్ధలు కొట్టారు జైశంకర్. ప్రాశ్చాత్య దేశాలకు చెందిన ప్రజాస్వామ్య విధానాలను మాత్రమే ఆ దేశాలు అనుసరిస్తున్నాయని.. అదే సమయంలో ప్రజాస్వామ్య విరుద్ధమైన భావాలను వర్థమాన దేశాలపై ఎగదోస్తున్న వైనాన్ని తప్పు పట్టిన ఆయన.. ‘‘ప్రజాస్వామ్యంలో భారత్ అనుసరిస్తున్న విధానం ప్రపంచంలోని పలు దేశాలకు అనుసరించేందుకు వీలుగా ఉంది. వర్ధమాన దేశాల్లో విజయవంతమైన నమూనాలను ప్రాశ్చాత్యదేశాలు అనుసరించేందుకు వీలుగా కిందకు దిగి రావాలి. ఇప్పటికీ మాదే సరైన ప్రజాస్వామ్యమని ప్రాశ్చత్య దేశాలు భావిస్తున్నాయి. ఇతరులది తక్కువని భావిస్తున్నారు. ఈ తీరు తప్పు. చారిత్రకంగా చూస్తూ భారత సమాజం అందరినీ ఆమ్వానిస్తుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రజాస్వామ్య వ్యవస్థగా మనుగడ సాగిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలోని మంచీచెడులపై విశ్లేషనకు కొందరు స్వయం ప్రకటిత మేధావులు వస్తున్నారని.. అసలు వారితోనే సమస్యగా జైశంకర్ మండిపడ్డారు. ఇలాంటోళ్లు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయరని.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎలాంటి ప్రయత్నం చేయరన్న ఆయన.. ‘‘ఇలాంటి వారు సలహాలు ఇస్తుంటారు. సమాజంలో అణచివేతకు గురైన వారికి న్యాయం చేయటం ప్రాశ్చత్యులు ఎలాంటి విధానాల్ని అనుసరించారు? ఇదే భారత్ కు వచ్చేసరికి విమర్శలు చేయటం ద్వంద్వ నీతికి నిదర్శనం. ప్రాశ్చాత్య ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ప్రజాస్వామ్య విజయాలను గుర్తించాలి. వాటిని తమ దేశ వ్యవస్థల్లో భాగం చేసుకోవాలి’’ అంటూ సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు.

ఈ సందర్భంగా రష్యా నుంచి చమురు కొనుగోలును ప్రస్తావించారు. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తున్న వేళ.. భారత్ తన చమురు అవసరాల్ని రష్యా నుంచి కొనుగోలు చేయటాన్ని పలు ప్రాశ్చాత్య దేశాలు తప్పు పట్టాయి. దీనికి సమాధానాన్ని ఈ వేదిక నుంచి ఇచ్చిన కేంద్ర మంత్రి జైశంకర్.. ‘‘రష్యాపై ఆంక్షలున్నా భారత్ అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసింది. ఈ విధానంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకుండా చూశాం. భారత్ లో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎలాంటి ప్రమాదేశం లేదు. ఎలాంటి వివక్ష లేకుండా 80 కోట్ల మందికి రేషన్ అందుతోంది. భారత రాజకీయాలను ఆశావహ ద్రక్పథంతో చూస్తున్నాం. గత ఏడాది మా దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 70 కోట్ల మంది స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇది భారత ప్రజాస్వామ్య విజయం’’ అంటూ భారతదేశం గురించి.. దేశంలో అమలవుతున్న ప్రజాస్వామ్య భావనల్ని చెప్పుకొచ్చారు.