Begin typing your search above and press return to search.

భారత్ లో ఆడ, మగ సమానమే కానీ... ఐరాస కీలక వ్యాఖ్యలు!

భారత్ లో గత కొంతకాలంగా కొన్ని విషయాల్లో లింగ సమానత్వం పెరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Oct 2024 8:30 PM GMT
భారత్ లో ఆడ, మగ సమానమే కానీ... ఐరాస కీలక వ్యాఖ్యలు!
X

భారత్ లో గత కొంతకాలంగా కొన్ని విషయాల్లో లింగ సమానత్వం పెరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో గత కొంతకాలంగా భారత్ లో ఈ విషయంలో పురోగతి కనిపిస్తుందని, ఆ పురోగతి స్ఫూర్తిదాయకమని చెబుతూ... "కానీ" అనే వ్యాఖ్యలు చేసింది ఐక్యరాజ్యసమితి (ఐరాస)!

అవును... లింగ సమానత్వంలో భారత్ సాధిస్తున్న పురోగతి స్ఫూర్తిదాయకమని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. అయితే... సామాజిక కట్టుబాట్లు, సరైన భద్రత లేకపోవడం, పరిమిత శ్రామిక భాగస్వామ్యం, సరైన భద్రతా లోపం వంటి పలు కారణాలు లింగ సమానత్వానికి ఇంకా ఆటంకం కలిగిస్తునే ఉన్నాయని అభిప్రాయపడింది.

ఈ అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రయత్నాలు అవసరమని ఈ సందర్భంగా భారత్ కు ఐక్యరాజ్యసమితి సూచించింది. ఈ సందర్భంగా... ఐరాస మహిళా వ్యూహాత్మక భాగస్వాముల డైరెక్టర్ డేనియల్ సీమౌర్.. భారత్ లో ఐరాస మహిళల కంట్రీ రిప్రజెంటేటివ్ సుసన్ జేన్ ఫెర్గూసన్ స్పందించారు.

ఇందులో భాగంగా... "భారత్ లో మహిళల పురోగతి - సవాళ్లు" పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళల జీవితాల్లో మార్పుకు, బాలికల నిర్ధిష్ట అవసరాలకు బడ్జెట్ లో సుమారు 6.8 శాతానికి నిధులు పెరిగాయని అన్నారు. అంతరాలను తొలగించడానికి బడ్జెట్ లో నిరంతర విస్తరణ అవసరమని నొక్కి చెప్పారు.

ఈ విషయంలో కేవలం ప్రభుత్వ రంగం నుంచే కాకుండా... ప్రైవేటు రంగ పెట్టుబడులు కూడా అవసరమని.. అప్పుడే ఈ లక్ష్యాలను పూర్తిగా చేరుకోవడానికి వీలవుతుందని ఫెర్గూసన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో... పార్లమెంటులో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఆమోదం పొందడం జాతీయ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావాన్ని చూపుతుందని అభిప్రాయపడ్డారు.

ఇలా పలు పాజిటివ్స్ పై హర్షం వ్యక్తం చేస్తూనే... దేశంలో లింగ ఆధారిత హింస నిరంతర సమస్యగా ఉందని.. ఇది మహిళల భద్రత, స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తోందని ఎత్తిచూపారు. పీరియాడిక్ లేబర్ సర్వే ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారం దేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 37శాతం పెరిగిందని తెలిపారు.

అయితే... ఇంకా పలు సవాళ్లు ఉన్నాయని.. ఇందులో ప్రధానంగా పిల్లల సంరక్షణ, పనిప్రాంతంలో భద్రత, సురక్షిత రవాణాతో మహిళలు మరిన్ని ఆర్థిక అవకాశాలు పొందగలుగుతారని సూచించారు. ఇదే సమయంలో... మహిళల భద్రతపై దృష్టి సారించే కమ్యునిటీ పోలీసింగ్ ముఖ్యమని అభిప్రాయపడ్డారు!