విదేశీయులకు విడిదిగా భారత్!
భారత్ కు వచ్చే విదేశీయుల రాకతో విదేశీ మారక ద్రవ్యం కూడా భారీగా లభిస్తోంది. ఈ క్రమంలో ఫారెక్స్ ఆదాయం గతేడాదితో పోలిస్తే 17.62 శాతం పెరిగింది.
By: Tupaki Desk | 5 Oct 2024 8:30 AM GMTమనదేశం నుంచి విద్య, ఉద్యోగాల కోసం ఏటా లక్షల సంఖ్యలో భారతీయులు వివిధ దేశాలకు వెళ్తున్నారు. వీరిలో కొందరు తిరిగి వస్తుండగా మరికొందరు అక్కడే స్థిరపడిపోతున్నారు.
అయితే.. భారత్ నుంచి వెళ్లేవారే కాదు.. భారత్ కు వస్తున్న విదేశీయులు పెరుగుతుండటం కూడా హాట్ టాపిక్ గా మారింది. పాతొక రోత.. కొత్త ఒక వింత అన్నట్టు వివిధ దేశాల నుంచి భారత్ కు వస్తున్నవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలోనే 47.78 లక్షల మంది విదేశీయులు మనదేశానికి వచ్చారు. దీంతో విదేశీయులకు విడిది కేంద్రంగా భారత్ నిలుస్తోంది.
మనదేశానికి వచ్చిన విదేశీయుల్లో ఎక్కువ మంది అభివృద్ధి చెందిన దేశాలే వారే కావడం గమనార్హం. మనదేశానికి 2024లో వచ్చిన 47.78 లక్షల మందిలో అమెరికా నుంచి 17.56 శాతం, యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) నుంచి 9.82 శాతం, కెనడా నుంచి 4.5 శాతం, ఆస్ట్రేలియా నుంచి 4.32 శాతం మంది రావడం విశేషం. కాగా ఫారిన్ టూరిస్టు ఎరైవల్ (ఎఫ్‌టీఏ) కింద వచ్చిన వారు ఒక్క జూన్‌లోనే 7.06 లక్షల మంది ఉన్నారు.
కాగా 2019 జూన్ లో భారత్ కు వచ్చిన వారి సంఖ్య 7.26 లక్షలుగా ఉంది. ఇది 2023 జూన్‌లో 6.48 లక్షలుగా ఉంది. ఈ నేపథ్యంలో 2023 జూన్ ఎఫ్‌టీఏలతో పోలిస్తే ఈ ఏడాది 9 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో 2019తో పోలిస్తే 2 శాతం క్షీణత చోటు చేసుకుంది.
భారత్ కు వచ్చిన విదేశీయుల్లో ఎక్కువ (46 శాతం) మంది సరదాగా కుటుంబాలతో సహా గడిపి వెళ్లారు. మనదేశంలో ప్రముఖ పర్యాటక, ఆ«ధ్యాత్మిక, చారిత్రిక ప్రాంతాలను సందర్శించి వెళ్లారు. మరో 18 శాతం మంది అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చౌకగా లభించే వ్యాపార, వైద్య సేవల కోసం భారత్ కు వచ్చారు.
కాగా విదేశాల నుంచి భారత్ కు వస్తున్నవారిలో ఎక్కువ మంది ఢిల్లీ నుంచే వస్తున్నారు. ఢిల్లీ 31.45 శాతం విదేశీయుల రాకతో టాప్ లో నిలుస్తోంది. రెండో స్థానంలో ముంబై 14.83 శాతం, మూడో స్థానంలో హరిదాస్ పూర్ 9.39 శాతం, నాలుగో స్థానంలో చెన్నై 8.35 శాతం, ఐదో స్థానంలో బెంగళూరు 6.45 శాతం ఉన్నాయి.
భారత్ కు వచ్చే విదేశీయుల రాకతో విదేశీ మారక ద్రవ్యం కూడా భారీగా లభిస్తోంది. ఈ క్రమంలో ఫారెక్స్ ఆదాయం గతేడాదితో పోలిస్తే 17.62 శాతం పెరిగింది.
కాగా ఈ ఏడాది జనవరి–జూన్ మధ్యలో 1.50 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వెళ్లారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ఎక్కువ మంది విదేశీ యాత్రలు చేస్తున్నారు. గత ఆరు నెలల్లో భారతీయులు యూకే, సౌదీ అరేబియా, అమెరికా, థాయ్ లాండ్, సింగపూర్ వంటి దేశాలకు అత్యధికంగా వెళ్లారు.