కెనడా, చైనాతో వైరం.. భారత్ తో చెలిమి.. అమెరికా స్ట్రాటజీ ఇదే
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి.
By: Tupaki Desk | 27 March 2025 9:25 AMభారత్‌తో తమకున్న సంబంధాలు కెనడా, చైనాలతో పోల్చదగినవి కాదని అమెరికా స్పష్టం చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో భాగంగా అమెరికా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
వాషింగ్టన్ వాణిజ్య అధికారి బ్రెండన్ లించ్ తన బృందంతో కలిసి భారత్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో భారత అధికారులతో ఆయన బృందం చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు శుక్రవారం నాటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అమెరికా అధికారులు మాట్లాడుతూ ట్రంప్ పరిపాలనలో భారత్‌ను చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలతో కలిపి చూడటం లేదని తెలిపారు. ఆయా దేశాలతో కరెన్సీ అవకతవకలు, అక్రమ వలసలు, ఇతర భద్రతా సమస్యలు ఉన్నాయని, అయితే న్యూఢిల్లీతో కేవలం టారిఫ్‌ల సమస్య మాత్రమే ఉందని వారు పేర్కొన్నారు. ఈ సమస్యను ఇరు దేశాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాయని, రెండు దేశాల ప్రభుత్వాలకు సంతృప్తికరమైన ఫలితం ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్‌లో వాషింగ్టన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వాణిజ్యం, సుంకాలు వంటి అంశాలతో పాటు ఇరుదేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సంబంధించిన అంశాలపై ఆమె చర్చలు జరుపుతారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా పలు దేశాలపై సుంకాల భారం మోపుతున్నారు. భారత్ తమ వస్తువులపై అధికంగా సుంకాలు విధిస్తోందని ఆయన ఆరోపించారు. దీనికి ప్రతిగా వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రతీకార సుంకాలు విధిస్తామని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల అమెరికాలో పర్యటించారు. ప్రతిపాదిత సుంకాలను తగ్గించడం, వాటి వల్ల దేశంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన వాణిజ్య ఒప్పందం వంటి అంశాలపై ఆయన యూఎస్ వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్, వాణిజ్య కార్యదర్శి హూవార్డ్ లుట్నిక్‌లతో చర్చలు జరిపారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఇరు దేశాధినేతలు దౌత్య, వాణిజ్య, రక్షణ సంబంధాలపై చర్చలు జరిపారు. ఆ సమయంలో ట్రంప్ మాట్లాడుతూ టారిఫ్‌ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని మోదీతో స్వయంగా చెప్పినట్లు తెలిపారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ అధిక పన్నులు విధిస్తోందని, ఇకపై తాము కూడా అదే విధంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మొత్తానికి భారత్-అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు కీలకమైన మలుపు తిరుగుతున్నాయి. అమెరికా భారత్‌ను ఇతర దేశాలతో పోల్చబోమని స్పష్టం చేయడం సానుకూల పరిణామంగా చూడవచ్చు. అయితే, రానున్న రోజుల్లో ఇరు దేశాలు టారిఫ్‌ల సమస్యను ఎలా పరిష్కరించుకుంటాయో వేచి చూడాలి.