బియ్యంపై మోడీ సర్కార్ బ్యాన్ ఎత్తివేత.. ప్రపంచం ఊపిరి పీల్చుకునే మాట
భారత్ నుంచి బియ్యం ఎగుమతి అయ్యే దేశాల సంఖ్య 140 కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
By: Tupaki Desk | 29 Sep 2024 5:08 AM GMTదేశీయ అవసరాలకు తగినన్ని బియ్యం నిల్వలు లేని నేపథ్యంలో.. భారత్ నుంచి బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతిపై బ్యాన్ విధిస్తూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఎత్తి వేస్తూ తాజాగా నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ప్రపంచానికి ఊరట కలిగిన పరిస్థితి. ప్రపంచంలోనే అత్యధిక బియ్యాన్ని ఎగుమతి చేసే దేశంగా నిలిచిన భారత్.. 2022లో బియ్యాన్ని ఎగుమతి దేశాల మొత్తంలో 40 శాతం భారత్ నుంచే ఎగుమతులుకావటం గమనార్హం.
భారత్ నుంచి బియ్యం ఎగుమతి అయ్యే దేశాల సంఖ్య 140 కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇతర దేశాల ఆహార భద్రత అవసరాలను తీరుస్తూ భారత్ బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. కొన్నేళ్లుగా కొనసాగుతున్న బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై ఉన్ననిషేధాన్నిఎత్తేస్తూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు టన్ను బియ్యానికి (వెయ్యి కేజీలు) 490 డాలర్లు కనీస ధరగా నిర్ణయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఎగుమతి సుంకం నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు.
2022లో ప్రపంచ వ్యాప్తంగా బియ్యం ఎగుమతులు 5.54 కోట్ల టన్నులు ఉంటే.. మన దేశం నుంచి జరిగిన ఎగుమతులే 2.22 కోట్ల టన్నులు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. బియ్యాన్ని భారీగా ఎగుమతి చేసే దేశాల ఉమ్మడి ఎగుమతులు మొత్తం కూడా భారతదేశం ఒక్కటే ఎగుమతి చేసే బియ్యమే ఎక్కువగా ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. బియ్యం ఎగుమతులు ఎక్కువగా ఉన్న దేశాల్లో థాయిలాండ్.. వియత్నాం.. పాకిస్థాన్.. అమెరికాలు ఉన్నాయి. మన దేశం నుంచి బియ్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల జాబితాను చూస్తే.. బెనిన్.. బంగ్లాదేశ్.. అంగోలా.. కామెరూన్.. జిబౌటి.. గినియా.. ఐవరీ కోస్ట్.. కెన్యా.. నేపాల్ దేశాలుగా చెప్పొచ్చు.
బాస్మతి బియ్యాన్ని భారత్ నుంచి ఎక్కువగా ఎగుమతులు చేసుకునే దేశాల జాబితాలో ఇరాన్.. ఇరాక్.. సౌదీ అరేబియాలు ఉన్నాయి. ఎగుమతులపై విధించిన ఆంక్షల కారణంగా 2023లో భారతదేశం బియ్యం ఎగుమతులు 20 శాతం తగ్గినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బియ్యం ఎగుమతులపై మోడీ సర్కారు ఆంక్షలు విదింపి నేపథ్యంలో మన దేశం నుంచి బియ్యం కొనుగోలు చేసే దేశాలు థాయిలాండ్.. వియత్నాం.. పాకిస్థాన్.. మయున్మార్ దేశాలున్నాయి. వినియోగదారుల ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి తగ్గింది. గత ఏడాది సెప్టెంబరులో 9.94 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఈ ఏడాది 5.35 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.