Begin typing your search above and press return to search.

ట్రంప్ దెబ్బకు భారత్ కూడా సుంకాలు తగ్గించిందా?

భారత్ సుంకాల తగ్గింపుకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడం వాణిజ్య రంగంలో ప్రాధాన్యం సంతరించుకుంది.

By:  Tupaki Desk   |   8 March 2025 10:47 AM IST
ట్రంప్ దెబ్బకు భారత్ కూడా సుంకాలు తగ్గించిందా?
X

భారత ప్రధాని నరేంద్రమోడీ తనకు జిగ్రీ దోస్త్ అయినా.. తన కోసం అంతకుముందు ఎన్నికల్లో ప్రచారం చేసినా కూడా భారత్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గలేదు. సుంకాల విషయంలో ఇండియాను టార్గెట్ చేశారు. భారత్ తగ్గించకపోతే మేము కూడా తగ్గించకుండా పెంచుతామని హెచ్చరించారు. దీనికి టైం కూడా ఇచ్చారు. అమెరికా స్వప్రయోజనాలే ధ్యేయంగా ముందుకెళుతున్న ట్రంప్ దెబ్బకు కెనడా, మెక్సికోలే కాదు.. ఇప్పుడు భారత్ కూడా వెనక్కి తగ్గింది. సుంకాలు తగ్గింపునకు అంగీకరించింది. ఇలా ట్రంప్ అనుకున్నది సాధించేస్తున్నాడు.

భారత్ సుంకాల తగ్గింపుకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడం వాణిజ్య రంగంలో ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ అధిక సుంకాలను విధించడం వల్ల అమెరికా సంస్థలు ఆ దేశంలో వ్యాపారం చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, తాము ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పిన తర్వాతే భారత్ సుంకాలను తగ్గించేందుకు అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ఆయన మరోసారి లేవనెత్తారు.

- భారత్‌లోకి టెస్లా ప్రవేశం

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా త్వరలో భారత్‌లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం భారత్ కార్ల దిగుమతిపై 110% సుంకాలను విధిస్తోంది. ఎలాన్ మస్క్ ఈ విషయంలో అనేక మార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశంగా భారత్‌ను అభివర్ణించిన మస్క్, టెస్లా కార్లను భారత్‌లో తక్కువ సుంకాలతో ప్రవేశపెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో అమెరికా నుంచి దిగుమతయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలా రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే, తక్షణమే సుంకాలను పూర్తిగా తొలగించేందుకు భారత్ ఇంకా ఆచితూచి స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

- రష్యా ఆయుధాలను కొనవద్దని భారత్ కు ఆఫర్

అమెరికా వాణిజ్యమంత్రి హోవార్డ్ లుట్నిక్, భారత్ తన రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడటం మానుకోవాలని సూచించారు. దీంతో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అభిప్రాయపడ్డారు. ప్రత్యామ్నాయంగా అధునాతన అమెరికన్ రక్షణ వ్యవస్థలను అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని చెప్పారు. అంతేకాక యూఎస్ డాలర్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీ కోసం బ్రిక్స్ (BRICS) దేశాలు ప్రయత్నించడం ఇరుదేశాల సంబంధాలకు ప్రతికూలంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించాల్సిందిగా భారత్‌ను కోరినట్లు లుట్నిక్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పలు మార్లు భారత్, చైనా తదితర దేశాలపై భారీ సుంకాలను విధిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 2న భారత్, చైనా విధించే సుంకాలు అమెరికా వాణిజ్య పరిస్థితిని ప్రభావితం చేయనున్నాయని పేర్కొన్నారు.

- భారత్ స్పందన

ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. సుంకాలు, సుంకాలేతర అడ్డంకులను అధిగమించేందుకు బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Agreement - BTA) కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించింది.

ఈ పరిణామాలు భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపులో ఉన్నాయి. భారత్ తన వ్యాపార విధానాలను సవరిస్తుందా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు ఇరుదేశాల భవిష్యత్తు వ్యాపార సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముంది.