Begin typing your search above and press return to search.

పాక్ మరణ శాసనం రాసుకున్నట్లే !

కానీ పాకిస్తాన్ తన ధోరణిని మార్చుకోలేదు. కయ్యానికే సిద్ధమని స్పష్టం చేసింది. అలా మోడీ హయాంలో కూడా భారత్ పాక్ సరిహద్దులలో మంటలే మండాయి.

By:  Tupaki Desk   |   20 March 2025 6:30 AM IST
పాక్ మరణ శాసనం రాసుకున్నట్లే !
X

రెండు వందల ఏళ్ళ పాటు మన దేశంలో తిష్ట వేసి మనలను మనుషులుగా కాకుండా బానిసలుగా చేసి పాలించిన తెల్ల దొరల మీద అంతా కలసి పోరాటం చేశాం. ధైర్య సాహసాలు చూపించాం. ఆ సమయంలో రాజ్యం కోసం తపన లేదు, అధికారం మీద మక్కువ అంతకంటే లేదు. భారత మాత దాస్య శృంఖలాలను తెంచాలన్న ఒకే ఒక్క కోరిక తప్ప మరేమీ లేదు.

అంత పవిత్రంగా నిబద్ధతతో పోరాటం అంతా కలసి చేశాం. ఆ సమయంలో ఉమ్మడిగా అఖండంగా భారత్ ఉంది. పాకిస్తాన్ భారత్ లో అంతర్భాగంగా ఉంది. మరి ఈ ఐక్యత చూసి కన్ను కుట్టిందో లేక ఇలాగే ఉమ్మడిగా ఉంటే భారత్ ప్రపంచంలో నంబర్ వన్ గా ఎదుగుతుందని ముందస్తు అంచనాతో ఎవరో చేసిన కుట్రనో తెలియదు కానీ అఖండ భారత్ కు స్వాతంత్ర్యం వస్తుంది అన్నది తెలిసిన వెంటనే ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ అన్న నినాదం అందుకున్నారు. వేరేగా ముస్లిం దేశం కావాలని పట్టుబట్టారు.

జిన్నా నాయకత్వంలో దాని మీద జరిగిన పోరాటానికి నాటి భారత నాయకులు చివరికి తలొగ్గక తప్పలేదు. 1945 కి ముందు అఖండ భారతం ముక్కలు కావాలంటే తన దేహం రెండుగా చీలిన మీదటనే అన్న మహాత్ముని మాటలను కూడా ఎవరూ మన్నించలేకపోయారు చివరికి భారత మాత గుండెలను రెండుగా చీలిస్తూ రెండు ముక్కలు అయింది. ఈ విధంగా విడిపోయి కలసి ఉందామని అనుకున్న భారత్ నాయకుల ఆశలు గత 78 ఏళ్ళుగా ఎక్కడా నెరవేరలేదు.

విడిపోయినా పాకిస్తాన్ భారత్ మీద పగ పట్టింది. భారత్ తో వేయి ఏళ్ళు యుద్ధం చేస్తామని నిస్సిగ్గుగా ప్రకటించింది. భారత్ మీద దుమ్మెత్తి పోయడమే తన లక్ష్యంగా చేసుకుంది. భారత్ మీదకు ఉగ్రవాదాన్ని ఎగదోయడంలోనే పైశాచిక ఆనందం పొందింది. భారత్ సుఖంగా ఉండకూడదని భారత్ శత్రువులతో జట్టు కట్టి కుట్రలు చేసింది.

దాని కోసం తన మొత్తం సమయాన్ని దేశ వనరులను ఆర్ధిక వ్యవస్థను కూడా ఫణంగా పెట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో ఎంతో మంది భారత నాయకులు పాకిస్థాన్ తో చెలిమికి చేయి ఇచ్చారు. శాంతిగా ఉందామని రాయబారాలు చేశారు కానీ దాయాది పాక్ తన బుద్ధిని మార్చుకోకుండా విషం కక్కుతూనే ఉంది.

భారత్ ని దాని మానాన ఉండనీయమని శపధం పడుతోంది. భారత్ మీద పూర్తి వ్యతిరేకతను అక్కడ ప్రజలను నూరిపోస్తోంది. ఆనాడు వాజ్ పేయి పాకిస్థాన్ ని మంచిగా చర్చలకు పిలిస్తే కార్గిల్ యుద్ధానికి తెర వెనక కుట్ర చేశారు. ఇక నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక సార్క్ దేశాల సమావేశానికి పాక్ ని ఆహ్వానించారు. ఆ దేశం తో చెలిమి కోసం అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ని స్వయంగా ఆ దేశానికి వెళ్ళి కలసి వచ్చారు.

కానీ పాకిస్తాన్ తన ధోరణిని మార్చుకోలేదు. కయ్యానికే సిద్ధమని స్పష్టం చేసింది. అలా మోడీ హయాంలో కూడా భారత్ పాక్ సరిహద్దులలో మంటలే మండాయి. ఇదిలా ఉంటే పాకిస్థాన్ లోని ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయని ఆలోచిస్తే వారు మాత్రం చిత్రంగా శాంతికి కోరుకుంటున్నారు. భారత్ తో మైత్రి పాక్ కి ఎంతో మేలు అని తలుస్తున్నారు.

గత ఎనిమిది దశాబ్దాలుగా పాకిస్థాన్ పగ ద్వేషంతో రగిలిపోతూ ఆ దేశానికి మిగిలించింది ఆకలి, అశాంతి, పేదరికం అన్నది జనాలకు బాగా తెలిసి వస్తోంది. అప్పుల కుప్పగా పాక్ తయారైంది. అక్కడ ఈ రోజు అంతర్యుద్ధం సాగుతోంది. బలూచిస్థాన్ పాక్ మీద తిరగబడుతోంది. పాక్ తన సొంత సమస్యలను సైతం పరిష్కరించుకోలేక దీని వెనక భారత్ ఉంది అని నిందలు వేయడానికి వెనకాడడం లేదు.

ఇవన్నీ చూసిన వారు పాక్ పాలకులు ఇకనైనా అన్నీ ఆలోచించి శాంతి వైపుగా అడుగులు వేయాలని కోరుకుంటున్నారు. కానీ పాక్ మాత్రం తన దేశంలో తన సైన్యంలో చైనాకు చోటిస్తూ ఆ దేశంతో చెలిమి చేస్తూ భారత్ మీద దాయాది పోరుకు సిద్ధపడుతోంది. ఇక్కడ ఒక్కటి నిజం అన్నది చరిత్ర చెబుతోంది.

భారత్ మీద పాక్ ఎంత ద్వేషం పెంచుకున్నా ఈ దేశాన్ని ఏమీ చేయలేదు. అంతే కాదు అంతకంతకు తానే తగ్గిపోతుంది. తానే ఇబ్బందులలో పడుతుంది. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ లెక్స్ ఫ్రీడ్ మాన్ తో తాజాగా జరిగిన పాడ్ క్యాస్ట్ లో మాట్లాడుతూ పాకిస్థాన్ పాలకులు శాంతి మార్గం ఎంచుకోవాలని ఆకాంక్షించారు.

అదే రెండు దేశాలకు మేలు చేస్తుంది అని అన్నారు. దానిని విజ్ఞతతో కూడిన నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. మరి పాక్ పాలకులలో మార్పు వస్తుందా అంటే ఈ రోజుకు రాకపోవచ్చు. కానీ ప్రజలలో వస్తున్న మార్పుతో అయినా ఆ దేశం ఏదో నాటికి శాంతి వైపునకు రాక తప్పదు. లేకపోతే పాక్ తనకు తానే మరణ శాసనం రాసుకున్నట్లే అవుతుంది అని అంటున్నారు.