Begin typing your search above and press return to search.

ఏదో జరుగుతోంది.. మోదీ సర్కారు బిగ్ ప్లాన్.. పీవోకే స్వాధీనం?

కానీ, అది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఆఖరికి 35 ఏళ్లుగా హిందూత్వ వాదం వినిపిస్తున్న బీజేపీ కూడా పీవోకే స్వాధీనం అంటూ ప్రజల్లోకి వెళ్తోంది.

By:  Tupaki Desk   |   7 March 2025 12:56 PM IST
ఏదో జరుగుతోంది.. మోదీ సర్కారు బిగ్ ప్లాన్.. పీవోకే స్వాధీనం?
X

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే).. దాదాపు 80 ఏళ్లుగా వివాదాస్పద ప్రాంతం.. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనే పాకిస్థాన్ పాలకులు తమ బుద్ధిని బయటపెట్టుకుంటూ కశ్మీర్ ను ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి భారత ప్రభుత్వ మేల్కొనేసరికి కొంత ప్రాంతం పాకిస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అదే పీవోకేగా మారింది. దీనిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని అప్పటినుంచి భారత పాలకులు చెబుతూనే ఉన్నారు. కానీ, అది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఆఖరికి 35 ఏళ్లుగా హిందూత్వ వాదం వినిపిస్తున్న బీజేపీ కూడా పీవోకే స్వాధీనం అంటూ ప్రజల్లోకి వెళ్తోంది.

ఎన్నికల నినాదం..

గత ఏడాది లోక్ సభ ఎన్నికల సమయంలోనూ బీజేపీ నేతలు కొందరు పీవోకే స్వాధీనం చేసుకుంటామంటూ ప్రకటనలు చేశారు. అయితే, ఎన్నికలు జరిగి ఏడాది అవుతున్నా దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం ఓ అనూహ్య కదలిక చోటుచేసుకుంది.

కార్గిల్ కు యుద్ధ విమానం

1999 నాటి యుద్ధంతో పీవోకే-భారత్ మధ్య చివరి ప్రాంతమైన కార్గిల్ గురించి అందరికీ తెలిసిందే. కార్గిల్ ప్రపంచంలోనే అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రాల్లో ఒకటి. ఇప్పుడు కార్గిల్ ల్యాండ్ అయింది భారత యుద్ధ విమానం సీ17ఎంవోఎన్. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఏసీ) వద్ద రహస్యంగా ఈ యుద్ధ విమానం ల్యాండింగ్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. సముద్ర మట్టానికి 9700 అడుగులు ఎత్తయిన కార్గిల్ లో ల్యాండింగ్ కు అతి క్లిష్టమైన ప్రదేశంలో దిగింది. గతంలో ఏఎన్ 32, సీ-130జె సూపర్ హెర్య్కులస్ లను కూడా ఇక్కడ ఉపయోగించారు. ఇవి 3-4 టన్నులు, 6-7 టన్నుల బరువైన సామగ్రిని మాత్రమే తీసుకెళ్లగలవు. సీ-17 ఏకంగా 35 టన్నుల బరువును మోసుకెళ్లగలదు.

పీవోకే స్వాధీనానికేనా?

పీవోకే స్వాధీనానికే మోదీ సర్కారు ప్రయత్నాలు సాగిస్తోందని కథనాలు వస్తున్నాయి. భౌగోళిక సమీకరణాల (జియో పొలిటికల్ ఈవెంట్స్) నేపథ్యాన్ని దీనికి ఉదహరిస్తున్నారు. పాకిస్థాన్ ఇప్పటికే అంతర్గత సమస్యలతో సతమతం అవుతోంది. బలూచిస్థాన్ లో అశాంతి రేగుతోంది. స్వాతంత్ర్యం ప్రకటించుకుంటుందని అంటున్నారు. మరోవైపు తాలిబన్లు సరిహద్దులోని డ్యూరాండ్ రేఖను దాటుతున్నారు.

వీటికితోడు కార్గిల్ లో భారత్ అతిపెద్ద యుద్ధ విమానాన్ని దించింది. పీవోకే స్వాధీనంతోనే కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందని లండన్ పర్యటన సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. దీనికి సమాధానంగా.. ‘‘మిమ్మల్ని ఆపుతున్నది ఎవరు?’’ సాక్షాత్తు కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు.

మరి చైనా ఆక్రమించిన ప్రాంతం?

కశ్మీర్ లో తాము ఆక్రమించిన కొంత ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది పాకిస్థాన్. ఆ తర్వాత భారత్ తో జరిగిన యుద్ధంలో లద్దాఖ్ లోని ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. మొత్తంగా చూస్తే జమ్ము-కశ్మీర్ లో 40 శాతం అటు పాక్ ఇటు చైనా ఆక్రమణలో ఉన్నాయి. మరి ఆక్సాయ్ చిన్ ను స్వాధీనం చేసుకునేది ఎప్పుడు?