టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి తెచ్చేందుకు సీక్రెట్ ఆపరేషన్!
ఇంత భారీగా బంగరాన్నితరలించే క్రమంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ సీక్రెట్ ఆపరేషన్ ను నిర్వహించింది.
By: Tupaki Desk | 31 Oct 2024 1:30 PM GMTప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న భౌగోళిక.. రాజకీయ పరిణామాల నేపథ్యంలో విదేశాల్లో దాచి ఉంచిన బంగారు నిల్వల్ని ఇటీవల కాలంలో రిజర్వు బ్యాంక్ ఇండియా దేశానికి తీసుకొచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటివరకు 214 టన్నులకు పైగా బంగారు నిల్వల్ని దేశానికి తెచ్చేశారు. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వాల్ట్ నుంచి మన దేశానికి 102 టన్నులు (టన్ను అంటే వెయ్యి కేజీలు. 102టన్నులు అంటే.. లక్ష రెండు వేల కేజీలు) బంగారాన్ని తీసుకొచ్చేశారు.
ఇంత భారీగా బంగరాన్నితరలించే క్రమంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ సీక్రెట్ ఆపరేషన్ ను నిర్వహించింది. హైసెక్యూరిటీతో.. పలు జాగ్రత్తలు తీసుకొని విజయవంతంగా మన దేశానికి సదరుబంగారు నిల్వల్ని తీసుకొచ్చేస్తున్నారు. లండన్ లోని భూగర్భ వాల్ట్ ల నుంచి బంగారాన్ని భారత్ కు తీసుకురావటం ఇది రెండోసారి. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని చెప్పుకోవాలి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తన తొమ్మిది అండర్ గ్రౌండ్ వాల్ట్ లలో పలు దేశాలకు చెందిన బంగారు నిల్వల్ని జాగ్రత్తగా భద్రపర్చింది. సుమారు 5350 టన్నుల బంగారాన్ని ఇక్కడ నిల్వ ఉంచి రక్షిస్తున్నారు.
భారతదేశ విషయానికి వస్తే.. రిజర్వు బ్యాంక్ ఇండియా వద్ద 855 టన్నుల బంగారం ఉంది. ఇందులో దాదాపు 510.5 టన్నుల బంగారాన్ని దేశంలోనే ఉంచారు. గడిచిన రెండేళ్ల వ్యవధిలో విదేశాల నుంచి 214 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తీసుకొచ్చారు. మన దేశానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్ మెంట్ లో 324 టన్నుల బంగారం ఉండగా.. ఇందులో అత్యధికం యూకేలోనే ఉంది.అందులోనూ 20 టన్నుల బంగారాన్నిడిపాజిట్ల రూపంలో ఉంచారు.
ఇటీవల పరిణామాల నేపథ్యంలో విదేశాల్లో దాచిన బంగారాన్ని దశల వారీగా దేశానికి తరలించే ప్రోగ్రాంను ఆర్బీఐ తీసుకుంది. ఈ క్రమంలో భారీ ఎత్తున జాగ్రత్తలు తీసుకొని సీక్రెట్ ఆపరేషన్ తో.. ఎలాంటి తప్పులు దొర్లకుండా బంగారాన్ని తరలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ బంగారు తరలింపుకోసం ప్రత్యేక విమానం.. అత్యంత భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా.. భారత ప్రభుత్వం కలిసి బంగారాన్నితరలించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. లక్షల కేజీల బంగారాన్ని తీసుకొచ్చేందుకు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.