పాకిస్థాన్ కు అంత స్థాయి లేదు.. గట్టిగా ఇచ్చిపడేసిన భారత్!
ప్రజాస్వామ్యం అణిచివేత, మానవ హక్కుల ఉల్లంఘన మొదలైన విషయాలపై పాకిస్థాన్ స్పందించింది.
By: Tupaki Desk | 27 Feb 2025 4:00 PM ISTప్రజాస్వామ్యం అణిచివేత, మానవ హక్కుల ఉల్లంఘన మొదలైన విషయాలపై పాకిస్థాన్ స్పందించింది. అది కూడా ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలిలో జమ్మూకశ్మీర్ లో భారత్ వల్ల అవి పోతున్నాయని చెప్పుకొచ్చింది. పాక్ నోట ఇలాంటి మాటలు రావడం ఒకెత్తు అయితే.. అవి తమపై విమర్శలుగా మారడంపై భారత్.. గట్టిగా ఇచ్చి పడేసింది.
అవును... ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై భారత్ పై పాకిస్థాన్ తరచూ తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... గతంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్ పై నిరాధారమైన, దురుద్దేశపూరితమైన ప్రచారం చేసింది పాకిస్థాన్. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది.
ఈ మేరకు భారత దౌత్యవేత్త పెటల్ గెహ్లాట్ పాకిస్థాన్ ను గట్టిగా నిందించారు. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా నిషేధిత అతిపెద్ద ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ నిలయంగా మారిందని, పాకిస్థాన్ లో మైనారిటీలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపాలని, భారతదేశం ఆక్రమిత ప్రాంతాలను పాకిస్థాన్ ఖాళీ చేయాలని గెహ్లాట్ కోరారు.
ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో స్పందించింది పాకిస్థాన్. ఈ సందర్భంగా... జమ్ముకశ్మీర్ లో ప్రజాస్వామ్యం అణిచివేతకు గురవుతోందని.. మానవ హక్కుల ఉల్లంఘటన జరుగుతోందని భారత్ పై ఆరోపణలు గుప్పించింది. ఈ ఆరోపణలపై భారత్ ఘాటుగా స్పందించింది.
వివరాళ్లోకి వెళ్తే... జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమావేశంలో పాకిస్థాన్ న్యాయ, మానవ హక్కుల మంత్రి ఆజం నజీర్ తరార్.. జమూకశ్మీర్ ని ఉద్దేశించి మాట్లాడారు. జమ్ముకశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘటన జరుగుతోందని ఆరోపించారు. దీనిపై స్పందించిన భారత రాయబారి క్షితిజ్ త్యాగి.. ధీటుగా స్పందించారు.
ఇందులో భాగంగా... కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లడ్డాఖ్ లు ఎప్పుడూ భారత్ లో అంతర్భాగమేనని.. దశాబ్ధాల తరబడి పాకిస్థాన్ ఉగ్రవాదం కారణంగా దెబ్బతిన్న ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని.. ప్రజస్వామ్య పురోగతి, ప్రజలకు గౌరవం కల్పించడం వంటివాటిపై భారత్ దృష్టి సారించిందని తెలిపారు.
ప్రధానంగా... మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీలను హింసించడంతో సహా ప్రజాస్వామ్య విలువలను పాటించని దేశం భారత్ కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో లేదని అన్నారు. అసలు.. పలు ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం ఆశ్రయం కల్పిస్తోందని.. అలాంటి దేశం తమపై ఆరోపణలు చేయడం మానాలని.. వారి ప్రజలకు సుపరిపాలనను అందించడంపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు.