ఐరాస వేదికపై పాక్ కు గట్టిగా ఇచ్చిపడేసిన భారత్!
అలాంటి దేశం హింస గురించి మాట్లాడటం అంటే అది కచ్చితంగా వంచనే అవుతుందని.. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే దేశం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోందని కౌంటర్ వేశారు.
By: Tupaki Desk | 28 Sep 2024 7:30 AM GMTఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ లో సాధారణ చర్చ సందర్భంగా ఊహించినట్లుగనే షరీఫ్.. జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఇదే సమయంలొ ఆర్టికల్ 370 గురించీ స్పందించారు. సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడిన షరీఫ్... తమ దేశంలోని సమస్యల గురించి కాకుండా.. కేవలం కశ్మీర్ గురించి సుదీర్ఘంగా మాట్లాడటం గమనార్హం.
అవును... ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సాధారణ చర్చ సందర్భంగా మైకందుకున్న షెహబాజ్ షరీఫ్.. పాలస్తీనా ప్రజల మాదిరిగానే జమ్ముకశ్మీర్ ప్రజలు కూడా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారన్నట్లు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ.. 2019 ఆగస్టులో భారత్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు.
దీంతో... భారత్ గట్టిగా సమధానం చెప్పింది. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ పై వక్రబుద్ధితో తన అక్కసు వెళ్లగక్కుకున్న పాకిస్థాన్ కు స్ట్రాంగ్ కౌంటర్ పడింది. ఇందులో భాగంగా... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ మాట్లాడటం ఏమిటో అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు మన దౌత్యవేత్త భవిక మంగళానందన్.
ఈ సందర్భంగా స్పందించిన ఆమె... పాకిస్థాన్ ప్రధాని, భారతదేశం గురించి ప్రస్థావించడంపై తాను మాట్లాడుతున్నట్లు చెబుతూ.. దురదృష్టవసాత్తు ఈ ప్రపంచ వేదిక అవాస్తవాలను వినాల్సి వచ్చిందని అన్నారు. సుదీర్ఘకాలంగా పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని తమ పొరుగుదేశాలపై ఆయుధంగా ఉపయోగిస్తుందనే విషయం అందరికీ తెలుసని గట్టిగా తగులుకున్నారు.
అలాంటి దేశం హింస గురించి మాట్లాడటం అంటే అది కచ్చితంగా వంచనే అవుతుందని.. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే దేశం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోందని కౌంటర్ వేశారు. వాస్తవం ఏమిటంటే... ఆ దేశం భారత భూభాగాన్ని కోరుకుంటోంది.. జమ్మూకశ్మీర్ లో ఎన్నికలకు అవాంతరం కలిగించేందుకు నిరంతరం ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తుందని అన్నారు.
ఈ నేపథ్యంలోనే... మిలటరీ సహాయంతో నడుస్తూ.. ఉగ్రవాదం విషయంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పాకిస్థాన్.. ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ గురించి మాట్లాడటమా అని భవిక మంగళానందన్ ఘాటుగా స్పందించారు.
కాగా... భారత్ చేతిలో ఎన్నిసార్లు భంగపడినా, పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐరాసా వేదికపైనా తన అక్కసు వెళ్లగక్కుకుంది. అలా అని పాకిస్థాన్ కు భారత్ చేతిలో భంగపాటుకు గురవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయా ఫోరంలలో చర్చిస్తున్న అంశాలతో సంబంధం లేకుండా భారత్ పై తన అక్కసు వెళ్లగక్కుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.