Begin typing your search above and press return to search.

భారత్‌ లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఈ స్థాయిలోనా?

భారత్‌ లో విద్యార్థుల ఆత్మహత్యలు అంతకంతకూ పెరిగిపోతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 8:30 PM GMT
భారత్‌ లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఈ స్థాయిలోనా?
X

భారత్‌ లో విద్యార్థుల ఆత్మహత్యలు అంతకంతకూ పెరిగిపోతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటా ఇవి అంతకంతకూ పెరుగుతున్నాయి. విద్యా సంస్థలు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటికి అడ్డుకట్ట పడటం లేదు.

పరీక్షల్లో ఫెయిల్‌ అవుతామనే ఒత్తిడి, తల్లిదండ్రులు ఏమంటారోనన్న భయం, ఇష్టం లేని కోర్సుల్లో తల్లిదండ్రులు బలవంతంగా చేర్చడం, కోచింగ్‌ పేరుతో ఇంటికి దూరంగా ఎక్కడో ఉంచటం, నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో సీట్లు సాధించలేకపోవడం వంటివాటితో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు.

దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలపై తాజాగా ఇంటర్నెట్‌ క్రైమ్‌ కంప్లైంట్‌ సెంటర్‌ (ఐసీ3) అనే స్వచ్చంధ సంస్థ నివేదిక విడుదల చేసింది. ‘‘విద్యార్థుల ఆత్మహత్యలు–భారత్‌ను వణికిస్తున్న మహమ్మారి’’ పేరిట ఈ నివేదికను వెల్లడించింది. జాతీయ నేర గణాంక రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ఆధారంగా దీన్ని విడుదల చేసినట్టు తెలిపింది.

ఈ నివేదిక ప్రకారం.. జాతీయ సాధారణ రేటును మించి విద్యార్థుల ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. గత 20 ఏళ్లుగా మన దేశంలో సాధారణ ఆత్మహత్యల రేటు 2%గా ఉంది. అయితే, విద్యార్థుల ఆత్మహత్యల రేటు 4% ఉండటం సర్వత్రా ఆందోళన రేపుతోంది.

2022లో విద్యార్థుల మొత్తం ఆత్మహత్యల్లో బాలలు/యువకులవి 53%గా ఉండటం విషాదం. 2021–22 మధ్య ఇవి 6 శాతం తక్కువగా నమోదయ్యాయి. మరోవైపు విద్యార్థినుల ఆత్మహత్యలు 7% పెరగడం గమనార్హం.

గత పదేళ్లలో విద్యార్థుల ఆత్మహత్యలు 6,654 నుంచి 13,044కు పెరిగాయని నివేదిక వెల్లడించింది. 0–24 ఏళ్ల మధ్య వయసున్న వారి జనాభా 58.20 కోట్ల నుంచి 58.10 కోట్లకు తగ్గిందని నివేదిక పేర్కొంది.

విద్యార్థుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కాగా కోచింగ్‌ సెంటర్ల కర్మాగారంగా పేరున్న కోటా పట్టణం వల్ల రాజస్థాన్‌ దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలో పదో స్థానంలో ఉంది.

మరోవైపు మొత్తం ఆత్మహత్యల్లో 29% దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే జరుగుతున్నాయని ఇంటర్నెట్‌ క్రైమ్‌ కంప్లైంట్‌ సెంటర్‌ (ఐసీ3) వెల్లడించింది.