Begin typing your search above and press return to search.

ఇండియా కూటమి నుంచి మరో ప్రధానమంత్రి అభ్యర్థి!

కాగా ఇప్పటికే ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి పదవికి రాహుల్‌ గాంధీ సరిపోతారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు అంటున్నారు

By:  Tupaki Desk   |   30 Aug 2023 11:19 AM GMT
ఇండియా కూటమి నుంచి మరో ప్రధానమంత్రి అభ్యర్థి!
X

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడానికి 25కి పైగా ప్రతిపక్ష పార్టీలు ‘ఇండియా’ పేరుతో కూటమి కట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీతోపాటు డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్, జేడీయూ, జార్ఖండ్‌ ముక్తి మోర్చా, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్‌), ఆర్జేడీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, సమాజ్‌ వాదీ పార్టీ వంటివి ఉన్నాయి.

కాగా ఇప్పటికే ఇండియా కూటమి తొలి సమావేశం పాట్నాలో జరగ్గా, రెండో సమావేశం బెంగళూరులో జరిగింది. మూడో సమావేశాలు ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1 ముంబైలో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఇండియా కూటమి కన్వీనర్‌ ను ఎన్నుకుంటారని తెలుస్తోంది. అలాగే కూటమి లోగో, సమన్వయ కమిటీ నియామకం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది.

కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియా గాంధీని లేదా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ (జేడీయూ)ను కన్వీనర్‌ గా ఎన్నుకుంటారని సమాచారం.

కాగా ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే రాహుల్‌ గాంధీ, నితీశ్‌ కుమార్, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (తృణమూల్‌ కాంగ్రెస్‌) పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధికారి ప్రతినిధి ప్రియాంక కక్కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇండియా కూటమికి సారథ్యం వహించాలన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజల సమస్యల పరిష్కారంలో విశేష కృషి చేస్తున్నారు. ఆయన అమలు చేస్తున్న విధానాల వల్ల ఢిల్లీలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉందన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.

కాగా ఇప్పటికే ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి పదవికి రాహుల్‌ గాంధీ సరిపోతారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు దేశ రాజకీయాలను సమూలంగా మార్చగల శక్తి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ఉందని.. ఆమెను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని టీఎంసీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇంకోవైపు ఇండియా కూటమి ఏర్పాటుకు ప్రధాన కారణం బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమారేనని.. కాబట్టి ప్రధాని పదవికి ఆయన తగినవారని జేడీయూ నేతలు చెబుతున్నారు.

ఇంకోవైపు భారత రాజకీయాల్లో కురువృద్ధుడు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అని.. ప్రధాని పదవికి సరైనవారని మరికొంతమంది అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ను ఇండియా కూటమి కన్వీనర్‌ గా, ప్రధానమంత్రిగా ప్రకటించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.

కాగా 2025లో జరిగే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇటీవల ఆమ్‌ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన ఇండియా కూటమిలో విభేదాలకు దారితీసింది. తమతో చర్చించకుండా ఇలా ఏకపక్ష ప్రకటన ఎలా చేస్తారని జేడీయూ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ను ప్రధానిగా ప్రకటించాలంటూ ఆ పార్టీ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై రేపు, ఎల్లుండి జరగబోయే కూటమి సమావేశాల్లో ఎలాంటి చర్చ జరుగుతుందో వేచిచూడాల్సిందే.