ఇండియా కూటమి.. ఏపీ నుంచి చేరేది ఈ బ్యాచేనా...!
దీనిలో ప్రాంతీయ పార్టీలను చేర్చుకుని.. కేంద్రంపై యుద్ధానికి రెడీ అయింది. ఇదే తరహాలో ఇప్పుడు ఏపీలోనూ ఇండియా కూటమిని ఏర్పాటు చేస్తామని.. పార్టీ ప్రకటించింది.
By: Tupaki Desk | 11 Jan 2024 11:30 AM GMTదేశంలో ప్రధాని నరేంద్ర మోడీని ఓడించడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిలో ప్రాంతీయ పార్టీలను చేర్చుకుని.. కేంద్రంపై యుద్ధానికి రెడీ అయింది. ఇదే తరహాలో ఇప్పుడు ఏపీలోనూ ఇండియా కూటమిని ఏర్పాటు చేస్తామని.. పార్టీ ప్రకటించింది. క్షేత్రస్థాయిలో బీజేపీయేతర పార్టీలను తాము కలుపుకొని ముందుకు సాగుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జేడీ శీలం ప్రకటించారు. అయితే.. కాంగ్రెస్‌తో అసలు కలిసి వచ్చేది ఎవరు? అనే చర్చ తెరమీదికి వచ్చింది.
ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీని ఓడించాలనేది కాంగ్రెస్ వ్యూహమే అయినా.. స్థానికంగా ఆ పార్టీకి ఓటు బ్యాంకు 0.5 శాతం కూడా లేదనేది అందరికీ తెలిసిందే. 2014కు ముందు రాష్ట్ర విబజనతో పార్టీ సంస్థాగతంగా ఉన్న పట్టును కోల్పోయింది. దీనిని వైసీపీ అందిపుచ్చుకుంది. ఫలితంగా ఒకప్పుడు కాంగ్రెస్‌కు దన్నుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ పాగా వేసింది. ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహం.. ఇలాంటి నియోజకవర్గాల్లో తాను పాగావేయాలనే. అయితే.. దీనికి ఇతర పార్టీలు ఏమేరకు కలిసి వస్తాయనేది ప్రశ్న.
ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ-జనసేనలు కలిసి ముందుకు సాగుతున్నాయి. వీరు బీజేపీని కలుపుకొని వెళ్లాలనే వ్యూహంతో ఉన్నారు. అయితే.. దీనిపై బీజేపీ నేతలు ఇంకా సాచివేత ధోరణిలోనే ఉన్నారు. దీనిపై ఎప్పుడు తేలుస్తారో తెలియదు. తేలే వరకు వేచి చూసే ధోరణిలోనే టీడీపీ-జనసేన నేతలు ఉన్నారు. సో.. ఈ రెండు కీలక పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్‌తో చేతులు కలిపే పరిస్థితి ఉండదు. పైగా కలిపినా.. తమ ఓటు బ్యాంకు ఎక్కడ దిబ్బతింటుందోననే లెక్కలు కూడా ఉన్నాయి. దీనిని బట్టి కాంగ్రెస్‌తో ఈ రెండు పార్టీలు కలిసి వచ్చే అవకాశం తక్కువగానే ఉంది.
ఇక, మిగిలిన పార్టీ ల విషయానికి వస్తే.. ఇప్పటికే కేంద్రంలోని కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్టులు మాత్రమే కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, వీరు కూడా.. ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో తేడా వస్తే.. పోయి పోయి.. కాంగ్రెస్‌తో జతకట్టి తమ చేతులు తాము కాల్చుకునే పరిస్థితి లేదు. ఇక, బీఎస్పీ, సహా.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించిన జైభారత్ నేషనల్ పార్టీ కూడా.. కాంగ్రెస్ తో జత కట్టే ఆలోచన ఉండదని పరిశీలకులు చెబుతున్నారు. ఏతా వాతా ఎలా చూసుకున్నా ఏపీలో ఇండియా కూటమి అనుకున్నంత ఈజీ అయితే కాదని అంటున్నారు పరిశీలకులు.