Begin typing your search above and press return to search.

ఎంత‌మాట‌.. 'ఇండియా' కూట‌మిలో భారీ చిచ్చు!!

యూపీకి చెందిన స‌మాజ్ వాదీ పార్టీ నుంచి ఢిల్లీ అధికార ఆప్‌, ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణ‌మూ ల్ కాంగ్రెస్‌, త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకే స‌మా ఇత‌ర చిన్నా చిత‌కా పార్టీల‌న్నీ కూడా చేతులు క‌లిపాయి

By:  Tupaki Desk   |   6 Nov 2023 3:30 PM GMT
ఎంత‌మాట‌.. ఇండియా కూట‌మిలో భారీ చిచ్చు!!
X

ఒక్క మాట ఒకే ఒక్క మాట‌.. ఇండియా కూట‌మిలో చిచ్చు రేపింది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని ఆ పీఠం నుంచి కింద‌కు దింపేయాల‌ని.. దేశంలో బీజేపీ పాల‌న‌ను అంత మొందించాల‌నే బ‌ల‌మైన ల‌క్ష్యం పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ క్ర‌మంలో త‌మ‌తో చేతులు క‌లిపేవారితో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ నేప‌థ్యంలో భార‌త జాతీయ అభివృద్ధి, స‌మ్మిళిత కూట‌మి( ఇండియా)గా ఏర్ప‌డింది. ఈ కూట‌మిలో అనేక ప్రాంతీయ పార్టీలు చేతులు క‌లిపాయి.

యూపీకి చెందిన స‌మాజ్ వాదీ పార్టీ నుంచి ఢిల్లీ అధికార ఆప్‌, ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణ‌మూ ల్ కాంగ్రెస్‌, త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకే స‌మా ఇత‌ర చిన్నా చిత‌కా పార్టీల‌న్నీ కూడా చేతులు క‌లిపాయి. ఈ మొత్తం పార్టీల‌కు కాంగ్రెస్ నేతృత్వం వ‌హిస్తోంది. అయితే.. కేంద్రంలోని మోడీపై పోరాటం చేయాల‌ని ఏర్ప‌డిన ఈ కూట‌మి ఐక్య‌త‌కు ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు.. పెద్ద స‌వాల్‌గా మారాయి.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌హా రాజ‌స్థాన్‌, తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మిజోరాంల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. ఆయా రాష్ట్రాల్లో కూట‌మి పార్టీలే బ‌లమైన ప్ర‌త్య‌ర్థులుగా ఉన్నాయి. దీంతో ఎవ‌రికి వారుగా త‌మ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి.. పోటీకి నిల‌బెట్టారు. ఇక‌, ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న నేప‌థ్యంలో ఇండియా కూట‌మిలోని పార్టీలు.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ.. అత్యంత దారుణంగా తిట్టిపోస్తున్నాయి. తాజాగా ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

``కాంగ్రెస్‌ జిత్తులమారి పార్టీ. దానికి రానున్న ఎన్నికల్లో ఓటు వేయకూడదు. చిత్తు చిత్తుగా ఓడించాలి`` అని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జతారా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పిలుపునిచ్చారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ను నమ్మవద్దని కోరారు. అది తననే మోసగించిందని, ఇక ప్రజల మాట ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే కుల గణనను ప్రస్తావిస్తోందన్నారు.

ఈ ప‌రిణామంతో ఇండియా కూట‌మిలో భారీ చిచ్చు రేగింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. అస‌లు ఈ కూట‌మి ఉంటుందా? ఉండ‌దా? అనే చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. కాంగ్రెస్‌ను న‌మ్మొద్ద‌ని ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న వారే చెబుతుంటే.. బీజేపీ ఊరుకుంటుందా? వ్య‌తిరేక ప్రచారం ప్రారంభించింది. ఇదీ.. సంగ‌తి!