Begin typing your search above and press return to search.

ఆర్మీ చేతిలోకి బంగ్లాదేశ్...భారత్ కి రెడ్ సిగ్నల్ !

అంతే కాదు సరిహద్దుల్లో బలగాలను అప్రమత్తం చేసిన బీఎస్‌ఎఫ్‌ పూర్తి నిఘాని పెట్టింది. అదే విధంగా కూచ్‌బెహార్‌, పెట్రాపోల్‌ సరిహద్దుల్లో భద్రతను పూర్తి స్థాయిలో పెంచింది.

By:  Tupaki Desk   |   5 Aug 2024 1:36 PM GMT
ఆర్మీ చేతిలోకి బంగ్లాదేశ్...భారత్ కి రెడ్ సిగ్నల్ !
X

భారత దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎవరు కాదన్నా ఇక్కడ ఉన్నంత స్వేచ్చ మరెక్కడా దొరకదు. భారతదేశం గత ఏడున్నర దశాబ్దాలుగా ఎన్నడూ విచ్చిన్నకరమైన పరిస్థితులను ఎదుర్కోలేదు. యాభై ఏళ్ల క్రితం నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించినా ప్రజాస్వామ్య యుతంగా పోరాటం సాగింది, 18 నెలల పాటు ఆందోళనలు జరిగాయి కానీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి వేరే శక్తులు తమ ఆధీనంలోకి తీసుకోలేదు.

భారత్ మూలాల్లోనే ప్రజాస్వామిక స్పూర్తి ఉంది. ప్రాచీన ప్రజాస్వామ్యం అని అమెరికా వంటి దేశాలు చెప్పుకోవచ్చు కానీ ప్రజాస్వామ్యం అన్న పేరు వాడుకలో లేనప్పటి నుంచి వేల ఏళ్ళ నుంచే భారత్ లో ఆ సహనం ఉంది. ఆ శాంతి ఉంది. భిన్నత్వాన్ని గౌరవించే గొప్ప గుణం ఉంది. అదే భారత్ కి శ్రీరామ రక్షగా ఈ రోజుకీ ఉంది.

భారత్ మట్టిలోనూ మూలాల్లోనూ ఇంకిపోయిన ప్రజాస్వామిక లక్షణాలు ఈ దేశాన్ని ఎల్ల వేళలా కాపాడుతూ ఉంటే భారత్ నుంచి వేరు పడిన పాకిస్థాన్ లో కానీ ఆ దేశం నుంచి వేరు పడిన బంగ్లాదేశ్ లో కానీ ఈ రోజు చూస్తున్న పరిణామాలు నియంతృత్వాన్ని స్వాగతిస్తున్నాయి. ఆర్మీ కనుసన్నల్లో దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉంది. అక్కడ ప్రజా ప్రభుత్వం అన్నది ఒక ముసుగు గానే ఎప్పటికీ ఉంటోంది అన్నది అంతా చెప్పుకునేదే.

ఇక బంగ్లాదేశ్ కూడా చివరికి అందులోకే వెళ్ళింది. బంగ్లాదేశ్ లో గత పదినేను ఏళ్ళుగా ప్రధానిగా పాలన చేస్తున్న షేక్ హసీనా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో రాజీనామా చేసి ప్రాణాలను గుప్పటి పెట్టుకుని భారత్ కి రక్షణ కోసం రావాల్సి వచ్చింది. రిజర్వేషన్ల పేరిట ఆ దేశంలో కొన్నాళ్ళుగా సాగుతున్న దారుణ మారణ కాండ వెనక ఆర్మీ ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయి.

ఇపుడు అదే ఆర్మీ ప్రజా ప్రభుత్వం పీక నులిపి అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి చూడడంతో నిజమని కూడా భావించే పరిస్థితులు ఉన్నాయి. ఇటీవలనే షేక్ హసీనా మరోసారి ప్రధానిగా నెగ్గారు. ప్రజా ప్రభుత్వం మళ్ళీ కొలువు తీరింది. ఆమె ప్రధానిగా ఉంటూ భారత్ కి నిజమైన మిత్రుడిగా బంగ్లాదేశ్ ని ఉంచింది.

ఉగ్ర కార్యకలాపాలు బంగ్లా నుంచి దేశ సరిహద్దులలో చొరబడుతున్న వేళ కట్టడి చేసే ప్రయత్నం ఆమె చేస్తున్నారు. ఇపుడు ఆర్మీ చేతులలోకి అధికారం వెళ్ళడంతో భారత్ కి ఉగ్రవాదుల దాడులు చొరబాట్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక విధంగా బంగ్లాదేశ్ ఆర్మీ చేతులల్లోకి వెళ్లడం అంటే భారత్ అన్ని విధాలుగా జాగ్రత్త పడాల్సి ఉంటుందని అంటున్నారు.

ఇప్పటికే పాకిస్థాన్ తో భారత్ కి తలనొప్పులు ఉన్నాయి. చైనాతో ఇబ్బందులు ఉన్నాయి. ఇపుడు మరో పొరుగు దేశం బంగ్లాదేశ్ ఆర్మీ చేతుల్లోకి వెళ్ళడం అంటే భారత్ వేయి కళ్ళతో తన అంతర్గత భద్రతను కాపాడుకోవాల్సి రావచ్చు. ఇక పశ్చిమ బెంగాల్ లో బంగ్లాదేశ్ నుంచి వలస వాదులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ పరిణామాలు భారత్ కి పూర్తి స్థాయిలో చికాకు పెట్టేవే అని అంటున్నారు మరో వైపు చూస్తే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌ చేరుకున్నారు. హిండన్‌ ఎయిర్‌బేస్‌లో హసీనా విమానం ల్యాండింగ్ అయింది. అదే విధంగా బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపధ్యంలో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు.

దీంతో ప్రస్తుతం సైనిక పాలనలో బంగ్లాదేశ్‌ వెళ్ళిపోయింది. ఈ నేపధ్యనంలో సాటి మిత్రురాలిగా ఆమెను సమాదరించి షేక్ హసీనాకు ఆశ్రయమిచ్చిన భారత్‌ తన గొప్ప మనసు చాటుకుంది. అంతే కాదు ఈ ఉద్రిక్తమైన పరిణామాల నేపధ్యంలో భారత్‌ బంగ్లా సరిహద్దులో హైఅలర్ట్‌ ని సైతం ప్రకటించారు.

అంతే కాదు సరిహద్దుల్లో బలగాలను అప్రమత్తం చేసిన బీఎస్‌ఎఫ్‌ పూర్తి నిఘాని పెట్టింది. అదే విధంగా కూచ్‌బెహార్‌, పెట్రాపోల్‌ సరిహద్దుల్లో భద్రతను పూర్తి స్థాయిలో పెంచింది. అదే విధంగా భారత్‌లోని బంగ్లాదేశ్‌ ఎంబసీ దగ్గర భద్రత పెంచార్. దాంతో పాటుగా బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ మొత్తం పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.