Begin typing your search above and press return to search.

భారత్-కెనడా.. చిచ్చుపెట్టి చలికాచుకుంటున్న ఆ దేశం?

అమెరికా స్టేట్‌ డిపార్ట్ మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ ప్రెస్ మీట్ లో ఇదే విషయం చెప్పారు.

By:  Tupaki Desk   |   26 Sep 2023 8:39 AM GMT
భారత్-కెనడా.. చిచ్చుపెట్టి చలికాచుకుంటున్న ఆ దేశం?
X

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది జూన్ మూడో వారంలో.. కానీ, దాదాపు మూడు నెలలు కెనడా ప్రభుత్వానికి పెద్దగా అభ్యంతరాలు లేవు. కానీ, ఇప్పుడు భారత్-కెనడా మధ్య ఉప్పునిప్పు కాదు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దౌత్యవేత్తల బహిష్కరణ.. పౌరులకు హెచ్చరికలు.. ఆందోళనలు.. ప్రభుత్వాల జోక్యం.. ఇలా అనేక పరిణామాలు వరుసగా జరుగుతున్నాయి. అయితే, స్వతహాగా కెనడాకు గొప్ప నిఘా వ్యవస్థ ఏమీ లేదని చెబుతారు. అది ఇతర సన్నిహిత దేశాల మీద ఆధారపడడమే తప్ప సొంత నిర్ణయానికి వచ్చేది లేదు. కానీ, నిజ్జర్ హత్య కేసులో భారత్ వంటి అతిపెద్ద దేశంపై ఏకంగా ఆ దేశ ప్రధాన మంత్రే ఆరోపణలకు దిగారు. దీనంతటికీ కారణం ఎవరు..?

లీకులిచ్చి.. ఆపై నంగనాచి..అమెరికా అంటే.. తనకంటే ఏదీ ముఖ్యం కాదనుకునే దేశం. ఆ దేశానికి కెనడా పొరుగునే ఉంటుంది. అమెరికా నిఘా కళ్లు ఎంత పెద్దవో చెప్పాల్సిన పని లేదు. నిజ్జర్ హత్య వివరాలను అమెరికానే కెనడాకు చేరవేసిందని స్పష్టమైంది. దీంతోనే ట్రూడో భారత్ పై నేరుగా ఆరోపణలకు దిగాడు. ఇప్పుడు అదే అమెరికా.. నిజ్జర్ హత్య దర్యాప్తులో సహకరించాలని కోరుతోంది. కచ్చితంగా దర్యాప్తు జరగాలని.. నిందితులకు శిక్ష పడాలని నంగనాచిగా మాట్లాడుతోంది.

అమెరికా స్టేట్‌ డిపార్ట్ మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ ప్రెస్ మీట్ లో ఇదే విషయం చెప్పారు. మరోవైపు నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని ఆరోపిస్తున్న కెనడా ఆ ఆధారాలను మిత్రదేశాలైన అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో పంచుకుంది. వీటి ఆధారంగా అవి భారత్ పై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టాయి.

జి20లోనూ చర్చకు వచ్చిందా? ఈ నెల 9, 10 తేదీల్లో భారత్ లో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా కెనడా ఇచ్చిన ఆధారాల్ని చూపుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా మిత్రదేశాధినేతలు ప్రధాని మోదీని చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.

కెనడా వద్ద ఎలాంటి ఆధారాలు లేవని భారత్ ఆరోపిస్తోంది. కెనడా విచారణలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని, కేవలం స్వదేశంలో సిక్కుల్ని సంతృప్తి పరిచేందుకే కెనడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు విదేశాంగశాఖ ఆరోపిస్తోంది. అయితే కెనడా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దాంతో పాటే మిత్రదేశాలు కూడా భారత్ పై అంతకంతకూ ఒత్తిడి పెంచుతున్నాయి.

రెచ్చిపోతున్న ఖలిస్థానీలు..భారత్ పై కెనడా ప్రభుత్వం దూకుడును చూసిన ఆ దేశంలో ఖలిస్థానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. భారత ఎంబసీల వద్ద నిరసనలకు దిగుతున్నారు. సోమవారం ఇలానే చేశారు. మరోవైపు కెనడాలో హిందువులు, ఆలయాలకు ముప్పుందని భారత నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.