హిస్టారికల్ ఇండియన్ రెస్టారెంట్ క్లోజ్... కారణం ఇదే!
భారతదేశ స్వాతంత్య్రానికి సంబంధించిన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం ఈ రెస్టారెంట్. "ఇండియా క్లబ్"
By: Tupaki Desk | 31 Aug 2023 6:19 AM GMTఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఒక రెస్టారెంట్ క్లోజ్ చేయబడుతోంది. అదేముందిలే అని లైట్ తీసుకుంటే పొరపాటే! కారణం... ఇది అలాంటి ఇలాంటి రెస్టారెంట్ కాదు.. భారతదేశ స్వాతంత్య్రానికి సంబంధించిన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం ఈ రెస్టారెంట్. "ఇండియా క్లబ్" అని పిలుచుకునే ఈ రెస్టారెంట్ కథాకమీషు ఏమిటో ఇప్పుడు చూద్దాం!
లండన్ లో భారత్ కి చెందిన ఓ ఐకానిక్ రెస్టారెంట్ ఉంది. ఇది సెంట్రల్ లండన్ లో రద్దీగా ఉండే రహదారిలో హోటల్ స్ట్రాండ్ కాంటినెంటల్ లోపల ఉంది. దక్షిణ భారతదేశ ఎన్నో రకాల వంటకాలను దక్షిణాసియా ప్రజలకు పరిచయం చేసింది ఈ రెస్టారెంట్. అంతేకాదు... స్వాతంత్య్రం కోసం పోరాడిని ఎందరో త్యాగధనులకు ఆతిధ్యం ఇచ్చింది ఈ రెస్టారెంట్.
అయితే త్వరలో ఈ రెస్టారెంట్ ను క్లోజ్ చేయనున్నారు. అవును... ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ క్లబ్ త్వరలో మూతపడుతోంది. ఆ భవనం ఉన్న ప్రదేశంలోని యజమానులు.. నిర్మాణంలో కొంత భాగాన్ని కూల్చివేయాలని.. అనంతరం మరింత ఆధునికరించిన హోటల్ గా మార్చాలని డిసైడ్ అయ్యారు. డిఫరెంట్ లుక్ లో మరిన్ని సౌకర్యాలతో వేరే ప్లాన్స్ చేస్తున్నారు!
దీంతో... ఈ ఇండియా క్లబ్ ని మూసివేయడం వల్ల లండన్ నగరం చరిత్రలో కొంత భాగాన్ని కోల్పోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. మరికొంతమంది దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు! ఎవరు ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం దక్కలేదు. ఈ క్లబ్ తెరిచి ఉండటానికి సెప్టెంబర్ 17 చివరి రోజు అని ప్రకటించేశారు!
కాగా... 1950 దశకంలో భారతీయ వలసదారులను కలుసుకునేందుకు ఓ ప్రదేశం అవసరమైంది. దీంతో ఇండియా లీగ్ సభ్యులు దీన్ని ప్రారంభించారు. అనంతరం కాలంలో బ్రిటన్ కు చెందిన ఓ సంస్థ 1900 కాలంలో ఈ క్లబ్ లో భారతదేశానికి స్వాతంత్య్రం కోసం ప్రచారం చేసింది.
ఈ క్లబ్ వ్యవస్థాపక సభ్యులలో భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ఒకరు. 1950, 60లలో భారతీయులు తమ భాష మాట్లాడే వారికోసం.. తమ దేశ ఆహారం తినడం కోసం ఇక్కడకు వచ్చేవారని చరిత్రకారురాలు చెబుతుంటారు. అంతేకాదు... బర్త్ డే పార్టీలు, పెళ్లిల్లు, పండుగలు జరుపుకోవడానికి రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చేవారంట.
ఈ క్రమంలో స్వాతంత్ర్యం అనంతరం చాలామంది ప్రజలు యూకేకి వలస వచ్చారు. అయితే లండన్ లో ప్రవాస భారతీయుల కోసం సాంస్కృతిక సంస్థలు ఏవీ లేకపోవడంతో ఆ లోటును ఈ ఇండియన్ క్లబ్ తీర్చింది. ఈ క్లబ్ ఇంటీరియర్ కూడా ఇండియాలోని కాఫీ షాపులను పోలేలా రూపొందించారు. 70 ఏళ్ల క్రిత ఏర్పాటు చేసిన స్ట్రెయిట్ బ్యాక్డ్ కుర్చీలనే ఇప్పటికీ వాడుతున్నారు.
ఇలా భారతీయులతో ఎంతో చారిత్రక సంబంధం కలిగి ఉన్న ఈ ఐకానిక్ రెస్టారెంట్ త్వరలో మూతపడబోతోంది. సెప్టెంబర్ 17 తర్వాత ఈ రెస్టారెంట్ చరిత్రలో కలిసిపోబోతుంది!