తాజా డీల్ తో ఆ దేశాల లగ్జరీ వస్తువులు చౌకగా
దేశ రాజధాని ఢిల్లీలో భారత్ - ఐరోపాలోని నాలుగు దేశాలు (స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్) మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి.
By: Tupaki Desk | 11 March 2024 9:30 AM GMTఆదివారం ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో భారత్ - ఐరోపాలోని నాలుగు దేశాలు (స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్) మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాల్ని ఆయా దేశాలు భారత్ కు ఇచ్చి పుచ్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా భారీగా విదేశీ పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు.. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకునే పలు లగ్జరీ వస్తువులపై దేశంలోని కస్టమ్స్ శాఖ విధించే భారీ పన్ను పోటు నుంచి తప్పించుకునే వీలుంది.
ఈ ఒప్పందాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో సంతకాలు చేసుకున్నారు. ఐరోపాలోని నాలుగు అభివృద్ధి చెందిన దేశాలతో భారతదేశం మొదటిసారిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంది. దీంతో రాబోయే పదిహేనేళ్ల వ్యవధిలో పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలకు అవకాశం ఏర్పడింది. అంతేకాదు దేశంలోకి వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ఒప్పందంతో మేకిన్ ఇండియాకు ఊతం ఇస్తుందని చెబుతున్నారు.
పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో భారత్ కు దిగుమతి అయ్యే అత్యంత విలాసవంతమైన వస్తువుల ధరలు తగ్గేందుకు వీలుగా పన్ను రాయితీలు ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. 15 భాగాలుగా ఉండే ఈ ఒప్పందం కారణంగా సంపన్న వర్గాలతోపాటు మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి వర్గాల వారు ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా స్విట్జర్లాండ్ నుంచి ఖరీదైన వాచీల్ని.. చాక్లెట్లను దిగుమతి చేసుకోవటం తెలిసిందే. తాజా ఒప్పందంతో పన్ను భారం తగ్గనుంది. ఈ ఒప్పందం కారణంగా రోలెక్స్.. ఒమేగా.. కార్టియర్ తదితర సంస్థలకు చెందిన వాచీలతో పాటు.. స్విస్ చాక్లెట్లు తక్కువ ధరకు లభించనున్నాయి.
అంతేకాదు.. స్విట్జర్లాండ్ నుంచి దిగుమంతి చేసుకునే ట్యూనా.. సాల్మన్ లాంటి సముద్ర ఆహారం, ఆలివ్, అవకాడో లాంటి పండ్లు..కాఫీ గింజలు.. ఆలివ్ ఆయిల్ కు సుంకం మినహాయింపు ఉంటుంది. సైకిల్ విడి భాగాలు.. స్మార్ట్ ఫోన్లు.. వైద్య పరికరాలు.. మందులు.. దుస్తులు.. స్టీల్ ఉత్పత్తుల మీద ఇప్పటివరకు విధించే సుంకం భారీగా తగ్గనుంది. అదెంత? అన్న ప్రశ్న మనసులోకి వస్తుంది.
ఉదాహరణకు ఇప్పటివరకు 5 డాలర్ల నుంచి 15 డాలర్ల లోపు ఉండే వైన్ కు మొదటి ఏడాదిలో సుంకం 150 శాతం ఉంటే.. తాజా ఒప్పందం పుణ్యమా అని 100 శాతానికి తగ్గనుంది. అంటే.. 50 శాతం పన్ను భారం తగ్గనుందన్న మాట. ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి తరచూ వినే ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ ను నిలపటమనే వాదనకు తాజా డీల్ కొంత మేలు చేయనుంది. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ.. ఇటీవల కాలంలో ఐదో స్థానానికి చేరుకోవటం తెలిసిందే. రానున్న రోజుల్లో దీన్ని మూడో స్థానానికి తీసుకెళ్లాలన్న లక్ష్యం నెరవేరనుంది. తాజా డీల్ తో భారత్ నుంచి ఈ నాలుగు యూరోపియన్ దేశాలకు ఎగుమతులు మరింత పెరగనున్నాయి.