ఇండియా అంటే మోడీ భయపడుతున్నారా ?
అదేమిటి ఇండియా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండియాను చూసి భయపడటం ఏమిటని అనుకుంటున్నారు.
By: Tupaki Desk | 19 July 2023 5:49 AM GMTఅదేమిటి ఇండియా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండియాను చూసి భయపడటం ఏమిటని అనుకుంటున్నారు. ఇక్కడ ఇండియా అంటే దేశమని కాదు అర్ధం. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) అని అర్ధం. దేశరాజకీయాల్లో మంగళవారం రెండు కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఢిల్లీలో నరేంద్రమోడీ నాయకత్వంలో ఎన్డీయే సమావేశం జరిగింది. అలాగే బెంగుళూరులో యూపీఏ+ప్రతిపక్షాల సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే యూపీఏ మాయమైపోయి అన్నీపార్టీలతో కలిసి ఇండియా ఏర్పాటైంది.
ప్రతిపక్షాలు బెంగుళూరులో సమావేశం పెట్టుకున్నప్పటినుండి మోడీ భయపడుతున్నట్లే అనుమానంగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాల్లోనే అనైక్యతే బీజేపీ బలంగా ఇంతకాలం నడిచింది. ఎప్పుడైతే రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే కసి ప్రతిపక్షాల్లో పెరుగుతోందో తమ ఎన్ని గొడవలున్నా ఏకతాటిపైకి రావాల్సిందే అన్న ఆలోచనకు వచ్చాయి.
ప్రతిపక్షాల్లో దేనికదేగా ఉంటే బీజేపీ దేన్నీ బతకనివ్వదనే నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే బలమైన పార్టీలని లేకపోతే నేతలని అనుకున్న వాళ్ళపై దర్యాప్తు సంస్ధలను ఉసిగొలుపుతున్నారు.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, జేడీయూ, ఆప్ లాంటి పార్టీలకు ఇది బాగా అనుభవంలోకి వచ్చింది. దాంతో తమ విభేదాలను పక్కనపెట్టి అందరు ఒకచోట చేరారు. వచ్చేఎన్నికల్లో బీజేపీని ఓడించకపోతే తమకు భవిష్యత్తు ఉండదనే భయమే అందరినీ ఒకచోటకు చేర్చింది.తమలోని విభేదాలను పక్కకు పెట్టేసి ప్రతిపక్షాలు ఏకమవుతాయని మోడీ ఊహించుండరు. సమావేశమైనా ఏకాభిప్రాయం సాధ్యంకాదని అనుకునుంటారు.
ఎప్పుడైతే ప్రధానమంత్రి పదవి తమకు ముఖ్యంకాదని కాంగ్రెస్ ప్రకటించిందో వెంటనే మిగిలిన పార్టీల్లో నమ్మకం, జోష్ పెరిగింది. ముందు బీజేపీని ఓడించటమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాయి. అందుకనే ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియాగా ఏర్పడ్డాయి.
దాంతో మోడీలో భయం మొదలైనట్లుంది. అందుకనే కొత్త కూటమిపై మోడీ నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఎన్డీయేని ఓడించటం తప్ప ఇండియాకు వేరే టార్గెట్ లేదనే అర్ధంలేని ప్రకటన ఇందులో భాగమే. ప్రతిపక్షాలను తాము టార్గెట్ చేయటంలేదని అబద్ధాలు చెప్పారు.
కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అధికారపార్టీ లేదా కూటముల్లో చిచ్చుపెట్టి ప్రభుత్వాలను పడగొట్టిన విషయం తెలిసిందే. ఏదేమైనా కొత్తగా ఏర్పడిన ఇండియా అంటే మోడీలో భయం మొదలైనట్లే ఉంది.