Begin typing your search above and press return to search.

పీవోకే.. నాట్ ఓకే.. మరి భారత్ స్వాధీనం ఎప్పుడు??

అది 1947.. భారత్-పాక్ రెండుగా విడిపోయాయి. కశ్మీర్ మాత్రం స్వతంత్రంగా ఉంది అప్పటికి.

By:  Tupaki Desk   |   14 May 2024 2:30 PM GMT
పీవోకే.. నాట్ ఓకే.. మరి భారత్ స్వాధీనం ఎప్పుడు??
X

అది 1947.. భారత్-పాక్ రెండుగా విడిపోయాయి. కశ్మీర్ మాత్రం స్వతంత్రంగా ఉంది అప్పటికి. దానికి రాజు హరిసింగ్. హిందువైన అతడి రాజ్యంలో ముస్లింలు మెజారిటీ ప్రజలు. అందాలతో అలరారే కశ్మీర్ పై పాకిస్థాన్ కన్నుపడింది. స్వాతంత్ర్యం తాలూకు స్వేచ్ఛా గాలులు పీలుస్తుండగానే కశ్మీర్ పై ఆక్రమణకు దిగింది. దీనిని భారత్ పసిగట్టే సరికి కొంత భాగంగా ఆక్రమణకు గురైంది. పాక్ సైన్యాన్ని ఎక్కడైతే నిలువరించారో అంతవరకు భూభాగం 75 ఏళ్లుగా పాకిస్థాన్ ఆక్రమణలోనే ఉంది. దానికి భారత్ పెట్టిన పేరు ‘పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)’. కానీ, పాకిస్థాన్ పిలుచుకునే పేరు ‘ఆజాదీ కశ్మీర్’.

పాక్ నియంత్రణలోనే ఉందా?

పీవోకే పాకిస్థాన్ నియంత్రణలోనే ఉంది. అయితే, అక్కడ కొన్నేళ్లుగా నిత్యం ఆందోళనలు, తిరుగుబాట్లు జరుగుతున్నాయి. తాజాగా ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్తు కొరత పై జమ్ముకశ్మీర్‌ జాయింట్ ఆవామీ యాక్షన్‌ కమిటీ ఆందోళనలు చేపట్టింది. అవి హింసాత్మకంగా మారాయి. పీవోకే హింసతో దద్దరిల్లింది. దీంతో యావత్ పీవోకేలో 144 సెక్షన్ విధించారు.

వనరులు వీరివి.. ఫలాలు వారికి

పీవోకే నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తును మిగతా పాకిస్థాన్ వాడుకుంటోంది. అటు పీవోకేలో విద్యుత్తుకు ఇబ్బందులు వస్తున్నాయి. అధిక ధరలతో కనీసం గోధుమ పిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ వివక్షను నిరసిస్తూ తిరుగుబాటు మొదలైంది. ‘ఆజాదీ (స్వాతంత్య్రం)’ కావాలంటూ రోడ్లపైకి వస్తున్నారు. పీవోకేను భారత్‌ లో కలుపాలని కోరుతూ పోస్టర్లు వెలిశాయి. భద్రతా దళాలు, ఆందోళనకారుల ఘర్షణల్లో ఒక పోలీసు అధికారి మరణించగా, 100 మందికి గాయాలయ్యాయి.

దిగొచ్చిన పాక్ సర్కారు

నాలుగు రోజుల పాటు పీవోకేలో నిరసనలు వెల్లువెత్తడంతో పాకిస్థాన్ సర్కారు దిగొచ్చింది. పీవోకేకు రూ.2,300 కోట్లను విడుదల చేస్తామని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు.

మరి భారత్ స్వాధీనం ఎప్పుడు?

‘‘పీవోకే’’ను స్వాధీనం చేసుకుంటాం.. తరచూ బీజేపీ నాయకులు చెప్పే మాట ఇది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే ఎన్నోసార్లు ఇలా మాట్లాడారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలోని నాగర్ కర్నూల్ సభలోనూ ఇదే అంశం లేవనెత్తారు. పీవోకే భారత్ కే చెందుతుంద‌ని తెలిపారు. అయితే, పీవోకే స్వాధీనం అంత సులభం కాదు. కొండలు, పర్వతాలతో నిండిన ఈ ప్రాంతం మనకు తిరిగి వస్తుందా? అంటే కచ్చితంగా చెప్పడం కష్టమే. 75 ఏళ్లుగా కాంగ్రెస్ చేయలేనిది.. బీజేపీ 40 ఏళ్లుగా చెబుతున్నది కేవలం ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికే.