Begin typing your search above and press return to search.

భారత్ కీలక నిర్ణయం... కెనడా పౌరులకు ఎలక్ట్రానిక్ వీసా పునరుద్దరణ!

ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే అది కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాత్రమే అని మండిపడింది.

By:  Tupaki Desk   |   23 Nov 2023 4:02 AM GMT
భారత్  కీలక నిర్ణయం... కెనడా పౌరులకు ఎలక్ట్రానిక్  వీసా పునరుద్దరణ!
X

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌ లో ఆరోపించినప్పటినుంచీ ఈ ఇరుదేశాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలా కెనడా ప్రధాని చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే అది కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాత్రమే అని మండిపడింది.

నాటి నుంచి కెనడా, భారత్ ల మధ్య సఖ్యత కొరవడింది. దీంతో భారత్‌ కు కెనడాకు మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నాటి నుంచీ పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ చివరి వారం నుంచి ఇరు దేశాలు వీసా సేవల్ని నిలిపివేసుకున్నాయి. అయితే అక్టోబర్‌ 26 నుంచి తాత్కాలికంగా ఈ వీసా సేవల్ని అందించనున్నట్లు ఆ ప్రకటనలో భారత హైకమిషన్‌ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కెనడా పౌరులకు ఎలక్ట్రానిక్ వీసా సేవలను పునరుద్ధరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

అవును... దౌత్యపరమైన ఉద్రిక్తతల నడుమ వీసా సేవల్ని నిలిపివేసిన భారత్‌.. తిరిగి కెనడా పౌరుల కోసం ఆ సేవల్ని పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అక్టోబర్ 26 నుంచి ఎంట్రీ వీసా, మెడికల్‌ వీసా, బిజినెస్ వీసా, కాన్ఫరెన్స్‌ వీసాలను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా దాదాపు రెండు నెలల తర్వాత కెనడా పౌరులకు ఎలక్ట్రానిక్ వీసా సేవలను పునరుద్ధరించినట్లు భారత్ తెలిపింది.

కాగా... ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించినప్పటినుంచీ ఇరుదేశాల మధ్య సంబంధాలకు బీటలు వారిన సంగతి తెలిసిందే. ట్రూడో చేసిన ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. దీంతో నాటి నుంచీ ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన ఏర్పడింది.

దీంతో ఇరుదేశాలు తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. ఇరుదేశాలు దౌత్య వేత్తలను సమాన సంఖ్యలో ఉంచాలని ఈ సందర్భంగా భారత్ డిమాండ్ చేసింది. అనంతరం కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఎక్కువ సంఖ్యలో ఉన్న కెనడా దౌత్య వేత్తలను ఉపసంహరించుకోవాలని గడువు కూడా విధించింది. దీంతో భారత్ నుంచి కెనడా 41 మంది దౌత్య వేత్తలను కూడా ఉపసంహరించుకుంది.

అయితే జీ20 వర్చువల్ సమావేశం నిర్వహించడానికి ముందు భారత్ తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు రెండు నెలల తర్వాత ఎలక్ట్రానిక్ వీసా సేవలను ప్రారంభించినట్లయ్యింది. ఈ చర్యతో టూరిస్ట్ వీసాతో పాటు కెనడాకు అన్ని రకాల వీసాలను పునరుద్దరించినట్లయింది.