Begin typing your search above and press return to search.

ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి బిగ్ షాకిచ్చినట్లే?

అవును... దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి.

By:  Tupaki Desk   |   13 July 2024 7:49 AM GMT
ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి  బిగ్  షాకిచ్చినట్లే?
X

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ... బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ రాలేదు! ఈ నేపథ్యలో ఇటూ చంద్రబాబు, అటు నితీష్ కుమార్ ల భుజాలపై ఆనుకుని బండి నడిపిస్తున్నారు. ఈ సమయంలో ఉప ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకి బిగ్ షాకిచ్చాయని తెలుస్తోంది.

అవును... దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి ఎదుర్కొన్న తొలి పరీక్ష ఇదే కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో ఉదయం 8 గంటల నుంచి ఎలువడుతున్న ఫలితాలు ఆసక్తిగా మారాయి.

ఇందులో భాగంగా 13 అసెంబ్లీ స్థానాలకు గానూ 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. మిగిలిన రెండు చోట్ల మాత్రమే ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం... పంజాబ్ లోని జలంధర్ స్థానంలో ఆం ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి షీతల్ పై 37 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఇదే సమయంలో... పశ్చిమ బెంగాల్ లోని మానక్ తలా, బాగ్ధా, రాయ్ గంజ్, రాణాఘాట్... ఈ నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లోని దేహ్రాలో కాంగ్రెస్ అభ్యర్థి కమలేశ్ ఠాకుర్ ముందంజలో ఉన్నారు. నాలాగఢ్ స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. హమీర్ పుర్ లో మాత్రం బీజేపీ నేత ముందంజలో ఉన్నారు.

ఇక మధ్యప్రదేశ్ లోని అమర్ వాడా లో కాంగ్రెస్ అభ్యర్థి, తమిళనాడులోని విక్రావండిలో డీఎంకే నేత అన్నియుర్ శివ ముందంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్, మంగలౌర్.. రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ నేతలే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ విధంగా 13 స్థానాల్లోనూ 11 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉండగా... 2 స్థానాల్లో మాత్రమే ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

కాగా... వెస్ట్ బెంగాల్ లో నాలుగు.. హిమాచల్ ప్రదేశ్ లో మూడు.. ఉత్తరాఖండ్ లో రెండు.. తమిళనాడు, బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్ లలో ఒక్కో స్థానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా.. మరో మూడు చోట్ల ఎన్డీయే ప్రభుత్వం ఉంది.