మాల్దీవుల బలుపు వేళలోనూ భారత్ కు సుద్దులు.. ఇదేం పెద్దరికం?
దీనిపై నయా భారతం తీవ్ర ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేయటమే కాదు.. తమ టూర్లను రద్దు చేసుకున్న స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.
By: Tupaki Desk | 9 Jan 2024 4:56 AM GMTఅది తప్పు కానీ ఒప్పు కానీ దేశం మీదా.. దేశ ఇమేజ్ మీదా దాడి జరుగుతున్నప్పుడు.. దానికి సంబంధించి తమకు మించి తీర్పులు చెప్పే మేధావులు మరెవరూ లేరన్నట్లుగా వ్యవహరించే కొందరు బుద్దిజీవుల తీరుకు ఇప్పటికైనా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. నిత్యం..సొంత దేశం తప్పులు తప్పించి.. ఇరుగుపొరుగు దేశాల బలుపును పట్టించుకోకుండా.. వారి వల్ల మనకు ఎంత నష్టమో తెలుసా? అంటూ పిరికి మాటలు మాట్లాడే మేధావుల ఎజెండా అంతా వేరన్న విషయాన్ని మర్చిపోకూడదు.
వారి తీరు చూస్తే.. చిన్నోడికి భయపడాలి. పెద్దోడికి భయపడాలి. అందరికి చేతులు కట్టుకొని సలాం చేస్తూ ఉండాలి. వారేమన్నా పడుతూ ఉండాలి. ఎందుకంటే.. ఇది భారతదేశం. సొంత దేశం మీద అభిమానం కంటే కూడా పరాయి ప్రభుత్వాలు.. వారి బలాల్ని పొగుడుతూ.. వారి బలం ముందు మనమెంత? మనం జాగ్రత్తగా ఉండొద్దన్న మాటల్ని చూస్తే.. 'వాళ్లు పెద్దోళ్లురా.. మనకెందుకురా?' అంటూ మధ్యతరగతి మైండ్ సెట్ తో మాట్లాడే ఇంటి పెద్దల పాత్రను ఈ దేశ మేధావులు ప్రదర్శించటం ఏ మాత్రం సరికాదు.
తాజా మాల్దీవుల రగడను చూద్దాం. ఎజెండా ఏమైనప్పటికీ.. ఒక్క మాట తప్పు లేకుండా.. తన దేశంలోని ఒక అద్భుత పర్యాటక ప్రాంతాన్ని దేశ ప్రజలకు పరిచయం చేయటం దేశ ప్రధానిగా ఉన్న మోడీ తప్పేం చేయలేదే? తాను పర్యటించిన లక్ష దీప్ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆయన అనవసరమైన ఒక్క వ్యాఖ్యను చేసింది లేదు. "మీలోని సాహసికుడికి సరైన గమ్యస్థానం లక్షద్వీప్' అని మాత్రమే పేర్కొన్నారు.
దీనిపై మాల్దీవుల ఎంపీ ఒకరు.. ముగ్గురు మంత్రులు నోరు పారేసుకొని.. భారతదేశాన్ని.. మన పర్యాటక రంగాన్ని అవహేళన చేసేలా మాట్లాడారు. దీనిపై నయా భారతం తీవ్ర ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేయటమే కాదు.. తమ టూర్లను రద్దు చేసుకున్న స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. ఈ తీరుకు కొందరు బుద్ధి జీవులతో పాటు.. ప్రముఖ మీడియా సంస్థల ఎడిటోరియల్ కాలమ్స్ లో ఇష్టారాజ్యంగా రాసే రాతలు చూస్తే.. ఈ దేశం మీద వారికున్న ప్రేమేంటి? అన్న సందేహం కలుగక మానదు.
మాల్దీవులకు ఏడాదికి మన దేశం నుంచి లక్షల్లో పర్యాటకులు వెళతారని.. అదే లక్షద్వీప్ కు 10వేల మంది మాత్రమే వెళతారన్న మాటను చెబుతూ.. 'సెంటిమెంట్లు రేపి.. ప్రస్తుత వివాదాన్ని ఆత్మాభిమాన.. ఆత్మనిర్భర అంశంగా.. లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ గా చేస్తే అది వట్టి హ్రస్వద్రష్టి' అంటూ చేసే వ్యాఖ్యానాలు దేనికి నిదర్శనం? ఇదే సమయంలో 'లక్ష ద్వీప్ కు ప్రాముఖ్యం కల్పించాలని మోదీ సర్కారు భావిస్తే తప్పు లేదు కానీ.. ఆ చిరు కేంద్రపాలిత ప్రాంతంలో భారీ నిర్మాణాలతో జీవ్యావరణాన్ని దెబ్బ తీసే యత్నాలు మానాలి"అంటూ సుద్దులు చెప్పే పెద్ద మనుషులు.. చాలా విషయాల్ని మర్చిపోతున్నారు.
నిజంగానే పర్యావరణాన్ని దెబ్బ తీసేలా మోడీ సర్కారు నిర్ణయం తీసుకొని.. చేతల్లో చేసి చూపిస్తే వ్యతిరేకించటం తప్పు కాదు. కానీ.. అలా చేస్తారేమో? అన్న అంచనాతో నోటికి వచ్చినట్లుగా మాట్లాడేసే.. రాతలు రాసేయటంపైనే అభ్యంతరమంతా. ఏదో జరుగుతుందన్న ఊహాగానాలతో సొంత దేశం ఇమేజ్ తగ్గించే మాటల్ని చూస్తే.. తమకు నచ్చని ప్రభుత్వం అధికారంలో ఉండటంపై అక్కసు కనిపిస్తుందే తప్పించి.. మరింకేమీ కాదన్నది మర్చిపోకూడదు.
బాయ్ కాట్ మాల్దీవ్స్ లాంటి వ్యాఖ్యలు వినేందుకు బాగున్నా.. భౌగోళిక అనివార్యతల రీత్యా కుదిరేవి కాదనే మాటల్ని చూస్తే.. ఎవరు ఎవరి మీద ఆధారపడ్డారన్నది కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా? తన చుట్టూ ఉన్న చిరు దేశాలతోనే కాదు.. బలమైన దేశాలతోనూ పేచీ పెట్టుకునే చైనా.. అడ్డగోలుగా వ్యవహరిస్తూ అందరిని తన అదుపులోకి ఉంచుకోవాలనే ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటూ.. అందరిని తన కంట్రోల్ లో ఉంచుకోవటాన్ని చూస్తున్నాం. అలాంటి తీరును భారత సర్కారు చేయనప్పటిని.. తగదునమ్మా అంటూ నోటికి వచ్చినట్లుగా భారతదేశాన్ని.. భారత ప్రధానిని అనరాని మాటలు అన్నప్పుడు.. నోరు మూసుకోని ఉండాలనటం.. నోరెత్తి తన స్పందనను తెలియజేసిన వారిని పిచ్చోళ్లుగా.. అర్థంలేని ఆగ్రహాంగా తీర్పులు ఇవ్వటం కొందరు మీడియా మేధావులకు అలవాటుగా మారింది.
భావస్వేచ్ఛ పేరుతో నోటికి వచ్చినట్లుగా వాదనలు వినిపించటంలో అర్థం లేదు. ఆత్మాభిమానం అన్నది ఇసుమంత కూడా అక్కర్లేదు.. ఎవరి ముందైనా సరే.. సాగిలపడటమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరించాలంటూ బానిస బతుకుల విధానాన్ని బోధించే వారిని ఏమనాలి . తాగునీటి కొరతతో కిందా మీదా పడే మాల్దీవులు.. కొవిడ్ లో హాహాకారాలు చేసే వేళలో వైద్య సాయాన్ని అందించి.. అపన్న హస్తాన్ని అందించే దేశాన్ని చులకన చేసేలా మాట్లాడటం.. మిత్రుడిగా ఉండే మిత్రదేశ ప్రధానిని నోటికి వచ్చినట్లుగా మాట్లాడటాన్ని చూస్తూ ఊరుకోవాలా? పిల్లోడికి భయపడి.. పెద్దోడికి భయపడి బతికే బతుకు ఒక బతుకేనా? అలాంటి బతుకులు బతకాలని పెద్ద మనుషుల ముసుగులో నూరిపోసే వారిని ఏమనాలి ?