అనూహ్యం.. కంగారూ దేశంలో భారత గూఢచర్యం.. కేసు గట్టిదే
ఒక దేశంలో మరో దేశం గూఢచార్యం చేయడం కొత్తేమీ కాదు.. ఆ దేశంలో జరిగే పరిణామాలను గమనిస్తూ తమ దేశానికి చేరవేయడం గూఢచారుల పని.
By: Tupaki Desk | 22 Sep 2024 11:32 AM GMTఒక దేశంలో మరో దేశం గూఢచార్యం చేయడం కొత్తేమీ కాదు.. ఆ దేశంలో జరిగే పరిణామాలను గమనిస్తూ తమ దేశానికి చేరవేయడం గూఢచారుల పని. ఎంతో చాకచక్యంగా సాగే ఈ వ్యవహరం మూడో కంటికి తెలియదు. జేమ్స్ బాండ్ సినిమాలను చూసేవారికి గూఢచారి ఎలా ఉంటాడో తెలిసిపోతుంది. ఇప్పుడు ఇదే అంశం భారత్ మరో దేశానికి మధ్య తీవ్ర చర్చనీయాంశం అయింది. అదికూడా భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ దేశాల కూటమి మధ్య జరిగే క్వాడ్ సదస్సు కోసం భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలో చర్చకు రానుంది.
ఏమిటీ క్వాడ్?
అమెరికాకు దీటుగా ఎదుగుతూ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఏర్పాటైంది క్వాడ్. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా క్వాడ్ సభ్య దేశాల సదస్సు జరగనుంది. మోదీతో ఆస్ట్రేలియా ప్రధాని డేవిడ్ ఆల్బనీస్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగానే ఆస్ట్రేలియాలో భారత పౌరుల గూఢచర్యం అంశం ప్రస్తావనకు రానుందని చెబుతున్నారు.
నాలుగేళ్ల కిందట
చైనాతో విభేదించే ఆస్ట్రేలియా.. భారత్ తో బాగానే ఉంటుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. అయితే, నాలుగేళ్ల కిందట ఆస్ట్రేలియాలో గూఢచర్యం ఆరోపణలతో ఇద్దరు పౌరులను బహిష్కరించారు. అయితే, ఇది ఏప్ర్రిల్ లో బయటకు వచ్చింది. రక్షణ ప్రాజెక్టులు, విమానాశ్రయ భద్రతకు సంబంధించిన సున్నితమైన నిఘా సమాచారాన్ని సేకరించారని వీరిలో ఇద్దరిపై ఆరోపణలు వచ్చాయి. వీరు ఆస్ట్రేలియాలో స్థానికుల్లా పనిచేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నారని అభియోగం మోపారు. ఈ విదేశీ ఏజెంట్లు ఏ దేశానికి చెందినవారో మాత్రం బయటకు వెల్లడించలేదు. ఆస్ట్రేలియా మీడియా మాత్రం భారత్ తో సంబంధం ఉన్నవారిగా పేర్కొంది. ఆ దేశ ప్రభుత్వం వీటిని ధ్రువీకరించలేదు. అలాగే కొట్టిపారేయలేదు. విదేశీ జోక్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మాత్రం ప్రకటించింది.
ఆసీస్ ప్రధాని ఏమన్నారంటే..
క్వాడ్ సదస్సుకు హాజరైన సందర్భంలో భారత్ ను దీనిపై నిలదీస్తారా? అంటూ ఇటీవల ఆసీస్ ప్రధాని ఆల్బనీస్ ను మీడియా ప్రశ్నించింది. ‘మా గడ్డపై ఇలాంటి పనులు మానుకోండి. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి’ అని మోదీకి చెబుతారా కోరింది. దీంతో భారత గూఢచారుల బహిష్కరణ అంశంపై ఆల్బనీస్ ఒక వ్యాఖ్య చేశారు. ఇలాంటి అంశాలను ప్రైవేటుగా చర్చిస్తామని చెప్పారు. ‘‘గూఢచర్యానికి సంబంధించిన అంశాలను వ్యక్తిగతంగా మాట్లాడతా. అలాంటి అంశాలను దౌత్యమార్గాల ద్వారా చర్చించాలి. నేను ఈ విధానాన్నే కొనసాగిస్తా’’ అని ఆల్బనీస్ వ్యాఖ్యానించారు.
‘‘దౌత్యపరంగా ముందుకెళ్లడం, ఈ అంశంపై చర్చించడం వంటి పనులను చేయగలను. దీనిపై చర్చ జరుగుతుందని చెప్పగలను. భారత్, ఆస్ట్రేలియాది చాలా పటిష్ఠ బంధం. సమగ్ర ఆర్థిక భాగస్వామ్యంపై పరస్పర ఏకాభిప్రాయం కోరుకుంటున్నాం. మోదీతో దీని గురించి నేను చర్చిస్తా. రెండు దేశాల మధ్య మరింత బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి’’ అని ఆల్బనీస్ చెప్పారు.
ఆస్ట్రేలియాలో గూఢచర్యమా?
చైనా, పాకిస్థాన్ లో భారత్ గూఢచర్యం చేసిందంటే నమ్మొచ్చు. కెనడాలోనూ ఖలిస్థాన్ వాదులను అడ్డుకోవడానికి భారత్ తమ ప్రయత్నాలను సాగించిందనే ఆరోపణలు వచ్చాయి. కెనడా ప్రధాని ట్రూడోనే ఈ ఆరోపణలు చేశారు. ట్రూడో ఆరోపణల తర్వాత భారత్, కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ మాత్రం వాటిని గట్టిగా ఖండించింది. అయితే, ఆస్ట్రేలియాలో గూఢచర్యం చేసిందంటే మాత్రం ఆశ్చర్యంగా ఉంది.