Begin typing your search above and press return to search.

పాక్ జైల్లో మరో భారతీయుడు మృతి... ఏం జరిగింది?

ప్రస్తుతం భారతదేశానికి చెందిన సుమారు 180 మంది మత్స్యకారుల శిక్షా కాలం పూర్తైనప్పటికీ పాకిస్థాన్ జైళ్లలోనే మగ్గుతున్నారనే విషయం తీవ్ర కలకలం రేపుతోంది.

By:  Tupaki Desk   |   27 March 2025 10:29 AM
Indian Fisherman Commits Suicide in Pakistan Jail
X

ప్రస్తుతం భారతదేశానికి చెందిన సుమారు 180 మంది మత్స్యకారుల శిక్షా కాలం పూర్తైనప్పటికీ పాకిస్థాన్ జైళ్లలోనే మగ్గుతున్నారనే విషయం తీవ్ర కలకలం రేపుతోంది. వారి విడుదలకు ఆ దేశానికి చెందిన అధికారులు పలు కారణాలతో ఆలస్యం చేస్తూ వస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో మరో భారతీయ మత్స్యకారుడు మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది.

అవును... గత రెండేళ్లలో సుమారు ఎనిమిది మంది భారతీయ మత్స్యకారులు పాక్ జైల్లో మృతిచెందినట్లు కథనాలు రావడం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో భారతీయ మత్స్యకారుడు అక్కడ మృతి చెందారు. అది కూడా పాక్ జైల్లోని బాత్ రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.

వాస్తవానికి భారత్ – పాకిస్థాన్ జల సరిహద్దులపై సరిగా అవగాహన లేకుండా చేపల వేటకు వెళ్లి అక్కడి అధికారులకు చిక్కినవారు ఎంతోమంది ఉన్న సంగతి తెలిసిందే. భారతీయ అధికారుల లెక్కల ప్రకారం... ఈ ఏడాది జనవరి 1 నాటికి పాక్ జైల్లో సుమారు 266 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు.

ఇదే సమయంలో... భారత్ కు చెందిన మత్స్యకారుడు గౌరవ్ రామ్ ఆనంద్ (52) ను 2022లో అదుపులోకి సీతుకున్నారు. ఇందులో భాగంగా... అతడిని అరెస్ట్ చేసి కరాచీ జైల్లో ఉంచారు. నాటి నుంచి ఆనంద్.. అక్కడి జైల్లోనే మగ్గుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి బాత్ రూమ్ లోకి వెళ్లిన ఆయన.. తాడుతో ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.

అతడు బాత్ రూమ్ కి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానించిన జైలు అధికారి లోపలకు వెళ్లి చూడగా.. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఈ విషయం పై అధికారులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసేంతవరకూ మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజ్ లో ఉంచనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

కాగా.. ఈ ఏడాది జనవరి 1న ఇరుదేశాల ఖైదీల జాబితా మార్పిడి జరగ్గా.. ఈ లెక్కల ప్రకారం పాకిస్థాన్ జైళ్లలో భారతీయ ఖైదీలు 266 మంది ఉండగా.. భారత జైళ్లలో మొత్తం 462 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు మన ప్రభుత్వం చెబుతోంది! ఈ సమయంలో.. పాక్ జైల్లో భారతీయుడు తాడు సాయంతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

కాగా... 2022లో ఓ కేసుకు సంబందించి భారతదేశానికి చెందిన మత్స్యకారుడు బాబును పాకిస్థాన్ అధికారులు అరెస్ట్ చేయడం.. అప్పటి నుంచి అతడు కారాచీలోని ఓ జైల్లో శిక్ష అనుభవిస్తుండటం.. ఇటీవలే అతడి శిక్షా కాలం పూర్తైనప్పటికీ విడుదల కాకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో జనవరి 23న అతడు పాక్ జైల్లోనే ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.