Begin typing your search above and press return to search.

అర్ధరాత్రి హుటాహుటన కేంద్రం కీలక ప్రకటన... ఇదిగో హెల్ప్ లైన్ నెం.!

సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతోంది. తిరుగుబాటుదారులు ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తున్నారు. మరో పక్క ప్రభుత్వ దళాలు ఏమీ చేయలేని పరిస్థితికి నెలకొందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   7 Dec 2024 5:16 AM GMT
అర్ధరాత్రి హుటాహుటన కేంద్రం కీలక ప్రకటన... ఇదిగో హెల్ప్  లైన్  నెం.!
X

ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అటు ఇజ్రాయెల్ - గాజా మధ్య యుద్ధం, ఇటు రష్యా – ఉక్రెయిన్ మధ్య వార్ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం అనే చర్చ తెరపైకి వస్తోంది. ఈ పరిస్థితుల మధ్య సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతోంది. దీంతో... భారతదేశ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

అవును... సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతోంది. తిరుగుబాటుదారులు ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తున్నారు. మరో పక్క ప్రభుత్వ దళాలు ఏమీ చేయలేని పరిస్థితికి నెలకొందని అంటున్నారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... భారత పౌరులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని అర్ధరాత్రి హుటాహుటున అడ్వైజరీ జారీ చేసింది.

వాస్తవానికి సుమారు దశాబ్ధం పాటు అంతర్యుద్ధంతో తల్లడిల్లి, గత కొంతకాలంగా స్తబ్దుగా ఉంది సిరియాలో పరిస్థితి. అయితే... ఇటీవల బషర్ అల్ అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాల్ని వెనక్కి నెడుతూ తిరుగుబాటు దారులు రెచ్చిపోయారు.. కీలక పట్టణాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా... సనా, హమా సిటీని ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

ఇదే క్రమంలో పలు రీజియన్లు ప్రభుత్వం నుంచి ఇప్పటికే చేజారిన పరిస్థితి. ఫలితంగా అవనీ తిరుగుబాటుదారుల కంట్రోల్ లోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఇక వారు నెక్స్ట్ టార్గెట్ రాజధాని డమాస్కస్ అని అంటున్నారు. ఆ నగరాన్ని కూడా ఆక్రమిస్తే... సిరియా పూర్తిగా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లినట్లే!

పరిస్థితులు ఇలా అల్లకల్లోలంగా మారడంతో కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా.. సిరియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులెవ్వరూ తదుపరి నోటిఫికేషన్ జారీ చేసేవారకూ ఆ దేశానికి వెళ్లొద్దని సూచిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే అక్కడున్న భారతీయులు అంతా అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకొని వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని.. అత్యవసర పరిస్థితుల్లో డమాస్కస్ లోని భారత ఎంబసీతో టచ్ లో ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా... +963993385973 హెల్ లైన్ ని సంప్రదించాలని తెలిపారు.