Begin typing your search above and press return to search.

'భారతీయులకు సంకెళ్లు'.. వీడియోతో కన్ఫాం చేసిన అమెరికా అధికారి!

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను మిలటరీ విమానంలో బుధవారం వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Feb 2025 10:37 AM GMT
భారతీయులకు సంకెళ్లు.. వీడియోతో కన్ఫాం చేసిన అమెరికా అధికారి!
X

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ప్రత్యేక విమానంలో భారత్ కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తమకు భారతీయులైనా, ఇతర దేశస్తులైనా ఒకటే అన్నట్లుగా.. ట్రంప్ మిలటరీ విమానంలో ఎక్కించి టెక్సాస్ టు అమృత్ సర్ పంపించేశారు. ఈ సమయంలో "భారతీయులకు సంకెళ్లు"కి సంబంధించి షాకింగ్ అప్ డేట్ తెరపైకి వచ్చింది.

అవును... అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను మిలటరీ విమానంలో బుధవారం వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. తొలివిడతలో భాగంగా... 104 మంది భారతీయులను అమృత్ సర్ కు పంపించింది. ఈ సమయంలో వారి కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసిన మాట వాస్తవమేనని ఆ విమానంలో ప్రయాణించిన భారతీయుడితో పాటు అమెరికా అధికారి ధృవీకరించారు!

తాజాగా ఈ విషయాలపై బహిష్కరణకు గురైన ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా స్పందించిన జస్పాల్ సింగ్ (36) అనే వ్యక్తి ఈ బహిష్కరణ సమయంలో అమెరికా అధికారులు ఎలా ట్రీట్ చేశారనే విషయాన్ని వెల్లడించారు. ఈ సమయంలో... తనతో పాటు ప్రయాణికులందరికీ కూడా సంకెళ్లు వేసినట్లు వెల్లడించారు.

ఆ మిలటరీ విమానంలో ప్రయాణించిన భారతీయులందరీ చేతులు, కాళ్లను అమెరికా సైనికులు కట్టివేశారని.. ప్రయాణ సమయం అంత అలానే ఉంచారని.. భారత్ లో ల్యాండింగ్ తర్వాత మాత్రమే ఈ సంకెళ్లు తొలగించబడ్డాయని స్పష్టం చేశారు. దీంతో... ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది.

ఇక.. తనను చట్టబద్ధంగా అమెరికా తీసుకెళ్తానని హామీ ఇచ్చిన ఓ ట్రావెల్ ఏజెన్సీ మోసం చేసిందని.. తనను అమెరికాకు తీసుకెళ్లడానికి రూ.30 లక్షలు తీసుకుని ఆరు నెలల పాటు బ్రెజిల్ లోనే ఉంచేసి, తర్వాత అమెరికాకు అక్రమంగా తీసుకెళ్లారని.. ఈ నేపథ్యంలోనే అమెరికా సరిహద్దు దళాలు అరెస్ట్ చేశాయని జస్పాల్ సింగ్ తెలిపారు.

అమెరికా అధికారి వీడియో వైరల్!:

ఇలా తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులైన భారతీయులను తిరిగి స్వదేశానికి పంపుతున్న వ్యవహారానికి సంబంధించిన వీడియోను యూఎస్ బోర్డర్ పెట్రోల్ చీఫ్ మైఖేల్ డబ్ల్యూ బ్యాంక్స్ పంచుకున్నారు. ఆ వీడియోలో.. బహిష్కరించబడిన భారతీయులు విమానంలో ప్రవేశిస్తున్నప్పుడు వారి చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి ఉండటం స్పష్టంగా కనిపించింది.

ఈ సందర్భంగా... యూ.ఎస్.బీ.పీ, భాగస్వాములు అక్రమ వలసదారులను భారతదేశానికి సక్సెస్ ఫుల్ గా తిరిగి పంపించారని.. ఇది తమ సైనిక రవాణాను ఉపయోగించి జరిపిన అత్యంత దూరపు బహిష్కరణ విమానంగా గుర్తించినట్లు తెలిపారు. తమ ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడంలో ఈ మిషన్ తమ నిబద్ధతను నొక్కి చెబుతోందని రాసుకొచ్చారు.

ఇప్పుడు దీనికి సంబంధించిన ఎక్స్ పోస్ట్ లోని కామెంట్ సెక్షన్... ట్రంప్ - మోడీ స్నేహానికి సంబంధించినట్లు చెబుతున్న ఫోటోలతో నిండి కనిపిస్తుండటం గమనార్హం.