Begin typing your search above and press return to search.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు షాక్.. ట్రంప్ వల్ల కొలువులు గోవిందా!

అధ్యక్షుడు ట్రంప్ కొత్త టారిఫ్ ప్రణాళికలు అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదాన్ని పెంచాయి. జె.పి. మోర్గాన్ ఈ అవకాశాలను 60శాతానికి పెంచింది.

By:  Tupaki Desk   |   6 April 2025 5:29 AM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు షాక్.. ట్రంప్ వల్ల కొలువులు గోవిందా!
X

అమెరికా విధించనున్న కొత్త టారిఫ్‌ల కారణంగా భారత ఐటీ పరిశ్రమ రాబోయే రోజుల్లో సవాళ్లను ఎదుర్కోనుంది. ఈ టారిఫ్‌లు ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. అమెరికాలోని క్లయింట్లు తమ ఖర్చులను తగ్గించుకునేలా చేయవచ్చు. టారిఫ్‌లు నేరుగా ఐటీ సేవలపై లేనప్పటికీ, తయారీ, లాజిస్టిక్స్, రిటైల్ రంగాలలో ఉన్న భారతీయ కంపెనీల ప్రధాన అమెరికా క్లయింట్లు తమ బడ్జెట్‌లను కుదించుకోవడం వల్ల భారతీయ సంస్థలు ప్రభావితమవుతాయి. ఇది కొత్త ఒప్పందాలు కుదరడానికి ఎక్కువ సమయం పట్టేలా చేస్తుంది. కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లు ఆలస్యం అవుతాయి. ఆదాయ వృద్ధిపై ప్రభావం చూపుతుంది.

బెర్న్‌స్టీన్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వంటి ఆర్థిక సంస్థలు ఇప్పటికే భారతీయ ఐటీ రంగంపై తమ రేటింగ్‌లను తగ్గించాయి. రాబోయే రోజుల్లో కష్టాలు తప్పవని సంకేతాలు ఇస్తున్నాయి. భారతీయ సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది. $190 బిలియన్ల ఎగుమతుల్లో 50శాతం కంటే ఎక్కువ వాటా అమెరికాదే. అమెరికాలో ఏదైనా ఆర్థిక అనిశ్చితి లేదా ఖర్చుల తగ్గింపు భారతీయ ఐటీని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.

అధ్యక్షుడు ట్రంప్ కొత్త టారిఫ్ ప్రణాళికలు అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదాన్ని పెంచాయి. జె.పి. మోర్గాన్ ఈ అవకాశాలను 60శాతానికి పెంచింది. ఒకవేళ ఇది జరిగితే, 2026 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఐటీ సంస్థలకు స్వల్ప లేదా అసలు వృద్ధి ఉండకపోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అవసరానికి మించిన ఖర్చులపై ఆధారపడే కంపెనీలు - అదనపు, అత్యవసరం కాని సాంకేతిక సేవలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ఇటీవలి సంవత్సరాలలో వేగంగా అభివృద్ధి చెందిన అనేక పెద్ద, మధ్య తరహా భారతీయ ఐటీ సంస్థలు ఇందులో ఉన్నాయి.

బిఎన్‌పి పారిబాస్ విశ్లేషకుడు కుమార్ రాకేష్ ఈ మందగమనం ప్రభావాలు సెప్టెంబర్ త్రైమాసికం నాటికి స్పష్టంగా కనిపిస్తాయని భావిస్తున్నారు. భారతీయ ఐటీ ఉద్యోగ మార్కెట్‌కు రాబోయే రోజులు అనిశ్చితంగా కనిపిస్తున్నాయి.