అమెరికాలో విద్వేష దాడి: భారత సంతతి వృద్ధ నర్సుపై దారుణం
భారత సంతతికి చెందిన లీల లాల్ అనే 67 ఏళ్ల వృద్ధ నర్సుపై ఫ్లోరిడాలోని పామ్స్‌వెస్ట్ ఆసుపత్రిలో విద్వేష దాడి చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 6 March 2025 5:20 PM ISTఅమెరికాలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. భారత సంతతికి చెందిన లీల లాల్ అనే 67 ఏళ్ల వృద్ధ నర్సుపై ఫ్లోరిడాలోని పామ్స్‌వెస్ట్ ఆసుపత్రిలో విద్వేష దాడి చోటు చేసుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- దాడికి గురైన నర్సు
పామ్స్‌వెస్ట్ ఆసుపత్రిలోని సైకియాట్రిక్ వార్డులో పని చేస్తున్న లీల లాల్‌పై 33 ఏళ్ల రోగి స్టీఫెన్ ఎరిక్ స్కాంటిల్‌బరీ తీవ్రంగా దాడి చేశాడు. ఆందోళనకరమైన మనస్తత్వం కలిగిన స్కాంటిల్‌బరీ నర్సును పిడిగుద్దులతో అతి దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో ఆమె తీవ్ర గాయాలపాలయ్యారు. దాడిలో లీల లాల్ ముఖంలో ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి. అంతేకాకుండా, ఆమె చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రి నిర్వాహకులు హెలికాప్టర్ ద్వారా ఆమెను అత్యవసర చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తులో స్కాంటిల్‌బరీ భారతీయుల పట్ల విద్వేషభావంతో ఉన్నట్టు వెల్లడైంది. కోర్టులో అతని నేరపూరిత ప్రవర్తనకు సంబంధించిన పలు వీడియోలు సమర్పించగా, న్యాయమూర్తి అతన్ని సమాజానికి ప్రమాదకారిగా ప్రకటించారు.
ఈ ఘటన మరోసారి వలసదారులపై అమెరికాలో పెరుగుతున్న విద్వేష దాడులను బయటపెట్టింది. లీల లాల్ లాంటి వృద్ధులు, సేవా ధృక్పథంతో ఉన్న వ్యక్తులు కూడా ఇలా దాడికి గురవడం గమనార్హం. ఈ ఘటనపై భారత సంఘాలు, సామాజిక వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దోషికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.