విదేశీ జైళ్లలో భారతీయుల షాకింగ్ సంఖ్య.. ఎన్నో 'తండేల్'లు తీయవచ్చు!
ఈ సమయంలో విదేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న భారతీయుల షాకింగ్ సంఖ్యను ప్రభుత్వం వెల్లడించింది.
By: Tupaki Desk | 8 Feb 2025 8:30 PM GMTఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'తండేల్'.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు సుమారు 13 నెలల పాటు పాకిస్థాన్ లోని జైళ్లలో నరకం చవిచూసిన యదార్థ ఘటనకు సంబంధించిన కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో విదేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న భారతీయుల షాకింగ్ సంఖ్యను ప్రభుత్వం వెల్లడించింది.
అవును... ఉపాధి కోసం ఊరు వదిలిన అభాగ్యుల్లో చాలా మంది తెలిసో తెలియకో చేసిన తప్పులకు కటకటాల పాలవుతున్నారు. వీరిని స్వదేశాలకు తీసుకొచ్చే విషయంలో విదేశాంగ శాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో... విదేశీ జైళ్లలో ప్రస్తుతం విచారణలో ఉన్న భారతీయుల సంఖ్య 10,152 అని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ సమయంలో ఈ నెంబర్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లోక్ సభ లో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వీరి డేటాను పంచుకున్నారు. ఈ సందర్భంగా... సౌదీ అరేబియా, కువైట్, దుబాయ్, ఖతర్, పాకిస్థాన్, నేపాల్, యూఎస్ సహా 86 దేశాలకు సంబంధించిన డేటాను వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్న సమాచారం ప్రకారం.. సౌదీ అరేబియాలోని జైళ్లలో అత్యధికంగా 2,633 మంది భారతీయ ఖైదీలు ఉండగా.. యూఏఈ (దుబాయ్) లోని జైళ్లలో 2,518 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు. ఇదే సమయంలో.. నేపాల్ జైళ్లలో 1317 మంది.. పాక్ జైల్లో 266 మంది, శ్రీలంకలో 98 మంది ఉన్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో.. మంత్రిత్వ శాఖ వద్ద అందుబాట్లో ఉన్న సమాచారం మేరకు ఖతార్ లో విచారణలో ఉన్న ఖైదీలతో సహా జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీల సంఖ్యలో 611 అని.. ఫిఫా వరల్డ్ కప్ తర్వాత ఖతర్ జైళ్లలో పెద్ద సంఖ్యలో భారతీయ ఖైదీల సంఖ్య పెరుగుదలను గమనించలేదని.. కొనసాగింపు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఈ నేపథ్యంలో విదేశీ జైళ్లలోని భారతీయ ఖైదీల హక్కులను కాపాడేందుకు భారతీయ రాయబార కార్యాలయాలు అప్రమత్తంగా ఉన్నాయని.. వారికి సాధ్యమైనన్ని అన్ని కాన్సులర్ సహాయాన్ని అందించడమే కాకుండా.. అవసరమైన చోట సహాయం అందించడంలో కూడా సహాయపడుతున్నాయని తెలిపారు.
దీంతో... బ్రతుకు దెరువు కోసమని విదేశాలకు వెళ్లిన ఇంతమంది జీవితాలు, వాళ్లను నమ్ముకున్న కుటుంబాల పరిస్థితిని తలచుకోవడం షాకింగ్ గా ఉందని.. "తండేల్" లాంటి కథలు ఇంకా చాలానే చూపించొచ్చని అంటున్నారు నెటిజన్లు.
కాగా... ఇటీవల శిక్షాకాలం ముగిసిన తర్వాత కూడా భారత్ కు రప్పించలేకపోవడంతో ఓ భారతీయుడు పాకిస్థాన్ జైల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో.. భారతదేశానికి చెందిన సుమారు 180 మంది మత్స్యకారుల శిక్షా కాలం పూర్తైనప్పటికీ ఇంకా పాకిస్థాన్ జైళ్లలోనే మగ్గుతున్నారనే విషయం తీవ్ర కలకలం రేపుతోంది.