Begin typing your search above and press return to search.

నాడు 14 నెలలు - నేడు 2 నెలలు... ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి!

గురువారం యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది.

By:  Tupaki Desk   |   19 Dec 2024 7:13 AM GMT
నాడు 14 నెలలు - నేడు 2 నెలలు... ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి!
X

గురువారం యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇందులో భాగంగా.. మొదటిసారిగా 1 డాలర్ విలువ 85 రూపాయల మార్కును అధిగమించింది. గతంలో భారత కరెన్సీ విలువ ఒక రూపాయి తగ్గడానికి పట్టిన సమయం కంటే చాలా తక్కువ సమయంలో, అత్యంత వేగంగా విలువ పడిపోయిందని అంటున్నారు.

అవును... అమెరికా కరెన్సీ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్స్ తగ్గించి.. 2025లో తక్కువ రేటు తగ్గింపులను సూచించింది. దీంతో ఏర్పడిన ఆర్థిక సవాళ్ల కారణంగా ఒత్తిడిపై ఉన్న కరెన్సీపై అదనపు భారం కారణంగా ఈ క్షీణత ఏర్పడిందని అంటున్నారు.

గురువారం ప్రారంభ ట్రేడింగ్ లో యూఎస్ డాలర్ తో భారత రూపాయి మారకం విలువ బుధవారం (84.9525)తో పోలిస్తే 85.0650కి పడిపోయింది. ఈ సమయంలో... రూపాయి మారకం విలువ రూ.82 నుంచి రూ.83కి పడిపోవడానికి 10 నెలలు సమయం పట్టగా.. రూ.83 నుంచి రూ.84కి పడిపోవడానికి 14 నెలల సమయం పట్టిందని గుర్తు చేస్తున్నారు.

అయితే.. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.84 నుంచి రూ.85కి పడిపోవడానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే పట్టిందని చెబుతున్నారు. ఇటీవల రూపాయి క్షీణత వేగం పుంజుకుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈఏడాదిలో ఇప్పటివరకూ రూపాయి 2 శాతం బలహీనపడిందని చెబుతున్నారు.

ఇదే సమయంలో... ఇతర ఆసియా కరెన్సీలు కూడా గురువారం బలహీనపడ్డాయి. ఇందులో భాగంగా... కొరియన్ వోన్, మలేషియా రింగిట్, ఇండోనేషియా రూపాయిలు కూడా 0.8 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయాయని అంటున్నారు.