Begin typing your search above and press return to search.

డాలర్ ముందు రూపాయి పాపాయి.. నాడు రూ.3.30.. నేడు రూ.86

డాలర్‌ తో పోలిస్తే రూపాయి రోజురోజుకూ బక్కచిక్కుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కలుగజేసుకున్నా.. విలువలో పతనం ఆగడం లేదు.

By:  Tupaki Desk   |   11 Jan 2025 5:30 PM GMT
డాలర్ ముందు రూపాయి పాపాయి.. నాడు రూ.3.30.. నేడు రూ.86
X

అగ్ర రాజ్యం అమెరికా కరెన్సీ ముందు మన రూపాయి రోజురోజుకూ పాపాయిగా మారుతోంది. 80 ఏళ్ల కిందట దాదాపు సమానంగా ఉన్న రెండు కరెన్సీలు.. నేడు పోల్చి చూస్తే ఎక్కడో ఉన్నాయి. డాలర్ నానాటికీ బలపడి ప్రపంచ కరెన్సీ హొదా స్థాయికి ఎదగగా.. రూపాయి బాగా బక్కచిక్కుతోంది. బలహీనపడుతోంది.

డాలర్‌ తో పోలిస్తే రూపాయి రోజురోజుకూ బక్కచిక్కుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కలుగజేసుకున్నా.. విలువలో పతనం ఆగడం లేదు. ఇక శుక్రవారం చరిత్రలోనే తొలిసారి 86.04 వద్ద ముగిసింది. ముగింపు, ఇంట్రా డే పరంగా ఇదే జీవనకాల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.

అప్పట్లో రూ.3.30

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి 3.30 కావడం విశేషం. అంటే రెండు కరెన్సీలు దాదాపు సమానం. కాలం గడిచే కొద్దీ.. దశాబ్దాలు మారే కొద్దీ అంతరం బాగా పెరిగింది.

1966లో డాలర్ తో పోలిస్తే రూపాయి 7.50 కాగా, 1980కి వచ్చేసరికి అది రూ.6.61 అయింది. 1990లో రూ.17.01 వద్ద నిలిచింది.

ఆర్థిక సంస్కరణల అనంతరం

ప్రధానిగా తెలుగు తేజం పీవీ నరసింహారావు, గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా వచ్చాక 1990ల తొలినాళ్లలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. అయితే, 2000 సంవత్సరం నాటికి డాలర్ తో పోలిస్తే రూపాయి రూ.44.71, 2007 నాటికి రూ.49.32కి చేరింది.

చిత్రంగా 2010 సంవత్సరానికి రూ.46.02కి పడిపోయింది. 2015లో రూ.66.79, 2020లో రూ.74.31కి పెరిగింది. నాలుగేళ్ల వ్యవధిలోనే రూ.86కి చేరింది.

ప్రభావం ఏమిటి..?

రూపాయి క్షీణత కొనసాగితే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే ఏ దేశానికి అయినా ఇబ్బందే. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. ఆపై వాణిజ్య లోటు, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. విదేశాల్లో చదువు కోసం పిల్లలను పంపిన కుటుంబాలకు ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతుంది. ఉదాహరణకు రూ.25 లక్షల రుణం తీసుకోవాలనుకుంటే వడ్డీ రూ.30 వేలు అధికంగా పడుతుంది. ఇక ఎగుమతులు అధికంగా చేసే ఐటీ, ఔషధ రంగాలకు మాత్రమే పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి.